Ponguleti Srinivas Reddy: ధరణి సమస్యల అధ్యయనానికి కమిటి, రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు - మంత్రి పొంగులేటి
Dharani Portal Issue : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధరణి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ధరణిని ప్రక్షాళన చేస్తామన్నారు.
Dharani Committee Discuss on Land Issues : గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూసమస్యలు ఎదుర్కొన్నాయని వెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయని అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తాను ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పైగా భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని పొంగులేటి తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి త్వరలో ధరణి పోర్టల్‌ను పునర్‌వ్యవస్థీకరించి, భూ వ్యవహరాలకు సంబంధించిన చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఇప్పటికే తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు
ధరణి కమిటీ సభ్యులతో సమావేశం
శుక్రవారం నాడు డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి ధరణి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మంత్రి పొంగులేటితో పాటు సభ్యులు ఎం. కోదండ రెడ్డి, ఎం.సునిల్ కుమార్, మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా ధరణి పోర్టల్ తీసుకుని వచ్చిందన్నారు. ఈ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తుందన్నారు.
ఎన్నికల హామీ మేరకు..
తమ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ధరణిని ప్రక్షాళన చేస్తామన్నారు. అందుకు తగిన చర్చలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేసేందుకు నిపుణులైన ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ ఇచ్చిన సిఫారసులపై సమావేశంలో చర్చించారుక. కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే ముందు అన్ని జిల్లాలకు చెందిన కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
క్షుణ్ణంగా ఆర్వో ఆర్ యాక్ట్ పరిశీలన
ఈ ఐదుగురు సభ్యుల కమిటీ రాష్ట్రంలో పర్యటించి భూసంబంధిత నిపుణులు, అధికారులతో చర్చిస్తుంది. అలాగే 18 రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ఆర్‌వోఆర్ యాక్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ ట్రైబ్యునల్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే భూమికి సంబంధించిన ముఖ్యమైన అన్ని చట్టాలను కలపి ఒకే చట్టం కిందకు తీసుకురావాలని కమిటీ సూచించినట్లు చెప్పారు. ధరణి పోర్టల్‌ను బలోపేతం చేయడంతోపాటు సామాన్యులకు అందుబాటులో ఉండేలా, అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా మార్పులు చేపట్టబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పార్ట్-బిలో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
పెండింగులో 2.43లక్షల భూ సమస్యలు
ధరణి పోర్టల్ సమస్యలపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో సమస్యలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం .. వాటి పరిష్కారంపై దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.43 లక్షలు భూసమస్యలు పెండింగులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంది. కొన్ని సమస్యలు స్థానికంగానే పరిష్కారం అయ్యాయి. మరికొన్ని సమస్యలు మాత్రం జిల్లా కలెక్టర్ల స్థాయిలో, సీసీఎల్‌ఎ స్థాయిలో పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి. ఇంతలో పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ధరణి సమస్యల పరిష్కారానికి అడ్డంకి ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ధరణి పోర్టల్‌లోని పెండింగ్ భూముల అర్జీలను పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.