KTR On Metro : వచ్చే ఎన్నికల తర్వాత హయత్ నగర్ వరకూ మెట్రో - మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరేనన్న కేటీఆర్!
వచ్చే ఎన్నికల తర్వాత హయత్ నగర్ వరకూ మెట్రోను విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎల్బీనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
![KTR On Metro : వచ్చే ఎన్నికల తర్వాత హయత్ నగర్ వరకూ మెట్రో - మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరేనన్న కేటీఆర్! Minister KTR announced that the metro will be extended to Hayat Nagar after the next elections. KTR On Metro : వచ్చే ఎన్నికల తర్వాత హయత్ నగర్ వరకూ మెట్రో - మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరేనన్న కేటీఆర్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/1385ce52d52301ca41bfc5e3fbc7d1bb1670317159364228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KTR On Metro : మెట్రో రైలును ఎల్‌బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు పొడిగిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎల్బీనగర్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేసిన కేటీఆర్, అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. ‘నాగోల్, ఎల్‌బీ నగర్ వరకు మెట్రో పూర్తయ్యింది. నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ మధ్య ఐదు కిలోమీటర్ల మార్గాన్ని రెండో ఫేజ్‌లో కలిపే ప్రయత్నం చేస్తాం. రేపే చేస్తామని చేయలేదని అంటారు. అందుకే ముందుగానే చెబుతున్నా. నాకు తెలుసుకు, మీకు తెలుసు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే.. వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే.. " అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజారవాణాను విస్తరించే ప్రయత్నం చేస్తాం. టిమ్స్ ఆసుపత్రి గడ్డి అన్నారంలో రాబోతుందని ప్రకటించారు.
ప్రతీ ఏటా దేశ నలుమూలల నుంచి హైదరాబాద్‌కు ప్రజల వలస
ప్రతి ఏడాది సుమారు 28 రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌కు వచ్చి నివాసం ఉంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ది పనులు జరిపిస్తామని తెలిపారు. రూ.985 కోట్లతో నాలాల పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇక మూసీనది పై 14 కొత్త బ్రిడ్జిలను త్వరలో కట్టబోతున్నామని కేటీఆర్ అన్నారు. రూ.84 లక్షలతో జంతువుల కోసం స్మశాన వాటిక ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఆటోనగర్లో ఫ్లవర్ గార్డెన్ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది !
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముందు అభివృద్ధి తర్వాతే రాజకీయం అని ఆయన చెప్పారు. అయ్యప్ప కాలనీలోకి ఇకపై వరద నీరు రాదని అన్నారు. ఎల్బీనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ చుట్టూ ఉండే మున్సిపాలిటీల్లో రూ.220 కోట్లతో అభివృద్ధి పనులను చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కాకముందే తలసరి ఆదాయం రూ.1.20 లక్షలు మాత్రమే ఉందని, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.2.70 లక్షలకు తలసరి ఆదాయం చేరుకుందని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా పచ్చదనమే కనిపిస్తోందన్నారు.
ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు 9న శంకుస్థాపన
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకూ ఉంటుంది. రూ. ఆరు వేల కోట్లకుపైగా అంచనాలతో నిర్మిస్తున్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తోంది. శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణించే లక్షలాది మందికి ఈ మెట్రోరైల్ విస్తరణతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎయిర్ పోర్ట్ నుండి IT కారిడార్ లోని రాయదుర్గం మైండ్ స్పేస్, హై టెక్ సిటీ కి కేవలం 20 నిమిషాలలో చేరుకొనే అవకాశం మెట్రో పూర్తయిన తర్వాత ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)