Bandla Ganesh: బండ్ల గణేష్‌తో కలిసిన లలితా జువెలరీ అధినేత - ఇద్దరూ కలిసి పనుల పరిశీలన!
ఇదివరకే రూ.15 లక్షల రూపాయల విరాళాన్ని లలిత జ్యువెలర్స్ అధినేత డాక్టర్ కిరణ్ కుమార్ ప్రకటించారు. తాజాగా మరో రూ.6 లక్షల రూపాయలను అదనంగా ప్రకటించారు.
బంగారం నగల మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలర్స్ అధినేత డాక్టర్ కిరణ్ కుమార్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వచ్చారు. ఆ నియోజకవర్గంలోని నందిగామ మండలంలో నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నూతన నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. శుక్రవారం (జూలై 14) ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తో పాటు ఆయన దేవాలయ నిర్మాణ ప్రాంతానికి వచ్చారు. ఇద్దరూ కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక గురుస్వామి శ్రీశ్రీశ్రీ సతీష్ నాయర్ తదితర భక్త బృందం డాక్టర్ కిరణ్ కుమార్, నిర్మాత బండ్ల గణేష్ లకు స్వాగతం పలికారు.
అనంతరం వారు ఆలయ నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. ఇదివరకే రూ.15 లక్షల రూపాయల విరాళాన్ని లలిత జ్యువెలర్స్ అధినేత డాక్టర్ కిరణ్ కుమార్ ప్రకటించారు. తాజాగా మరో రూ.6 లక్షల రూపాయలను అదనంగా ప్రకటించారు. గురుస్వామి శ్రీశ్రీశ్రీ సతీష్ నాయర్ చెప్పిన మాటలకు ఎంతో తన్మయత్వం చెందిన కిరణ్ కుమార్ వెంటనే స్పందించి 15 లక్షలు కాదని, తాను మొత్తం రూ.21 లక్షల విరాళం ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. దీనికి స్పందించిన గురుస్వామి సతీష్ నాయర్ అయ్యప్ప దేవాలయం ముఖ ద్వారంపై సువర్ణ అక్షరాలతో లలిత జ్యువెలర్స్ అధినేత డాక్టర్ కిరణ్ కుమార్ పేరును లిఖిస్తామని ఆయన తెలిపారు.
ఇంత పెద్ద సాయం చేయడం ఎంతో గొప్ప విషయం అని ఆయనను అభినందించి సన్మానించారు. అనంతరం నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. లలిత జ్యువెలర్స్ అధినేత డాక్టర్ కిరణ్ కుమార్ ఆలయ నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించి, ఎంతో తన్మయత్వంతో రూ.21 లక్ష రూపాయలను ప్రకటించడం అద్భుతంగా ఉందని, ఇది అయ్యప్ప మహత్యం అని అభిప్రాయపడ్డారు. తన ప్రాంతానికి ఎంతో పెద్ద మనసుతో వచ్చి, ఆధ్యాత్మిక భావనతో లక్షలాది రూపాయలు ఇస్తున్న భక్తులకు, అదే విధంగా ప్రత్యేకంగా డాక్టర్ కిరణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని నిర్మాత బండ్ల గణేష్ పిలుపు ఇచ్చారు.
ఇదివరకే నిర్మాత బండ్ల గణేష్ ఆలయ నిర్మాణం కోసం సుమారు రెండున్నర కోట్ల రూపాయలను విరాళాల సేకరణ చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు డాక్టర్ కిరణ్ కుమార్ గురు స్వామి సతీష్ నాయర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు.