Lal Darwaza Bonalu: లాల్ దర్వాజ బోనాల్లో వ్యక్తి వద్ద తుపాకీ కలకలం! మరోవైపు, రెచ్చిపోతున్న లిక్కర్ వ్యాపారులు
గన్ ను స్వాధీనం చేసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు దొంగ నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
లాల్ దర్వాజ్ బోనాల ఉత్సవంలో అపచారం చోటు చేసుకుంది. ఓ దొంగ ఏకంగా ఉత్సవానికి గన్ తీసుకొని వచ్చాడు. విషయం తెలిసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తం అవడంతో దొంగను పట్టుకొని పక్కకి తీసుకొని వెళ్లారు. గన్ ను స్వాధీనం చేసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు దొంగ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దొంగ చుట్టూ 20 మంది టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టి, అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఉత్సవంలో మరింత భద్రత పెంచారు పోలీసులు. తుపాకీ తెచ్చిన వ్యక్తి వల్ల భక్తులకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అధికారులు, అలయ కమిటీ ఊపిరి పీల్చుకున్నారు.
బోనాల పండుగ సాక్షిగా మద్యం అమ్మకాలు
కుత్బుల్లాపూర్, సుభాష్ నగర్, సూరారం, జీడిమెట్ల పారిశ్రామిక వాడ సూరారం రాజీవ్ గృహకల్ప ప్రాంతాలలో జోరుగా బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం బోనాల సందర్భంగా వైన్ షాపులను బంద్ చేయించిన సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని బెల్ట్ షాపు యజమానులు ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. వారికి నచ్చిన ధరలతో అమ్మకాలు జరుపుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇది అంతటా జరుగుతుంది అని సమాధానం ఇచ్చారు. బెల్ట్ షాపులకు మాత్రం ఇలాంటివి ఏవీ కూడా వర్తించవని.. దానిని అదునుగా చూసుకుని వారు ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు.
రోడ్లపై చెట్ల సందులలో వీరి వ్యాపారం సాగుతోంది. అయితే, ఎక్సైజ్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎక్సైజ్ అధికారులు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి బెల్ట్ షాపులు నడవడం లేదని వివరణ ఇచ్చారు. కానీ దానికి భిన్నంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బెల్ట్ షాపుల జోరు కొనసాగుతూనే ఉంది.
మంత్రి తలసాని పట్టు వస్త్రాలు
లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారికి, అక్కన్న మాదన్న ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ బోనాల పండుగ అని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఏటా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని అన్నారు.
ప్రయివేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఐక్యతకు మారుపేరు పండుగలు, ఉత్సవాలు అని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు అంతా సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి ఆకాంక్షించారు.
అమ్మవారిని దర్శించుకున్న రేవంత్, భట్టి
లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కుటుంబ సమేతంగా లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో వీరికి స్వాగతం పలికి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారికి భట్టి దంపతులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆశీర్వచనం చేసి అమ్మవారి పసుపు, కుంకుమ, ప్రసాదాన్ని ఆలయ పండితులు అందజేశారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భట్టి విక్రమార్క, రేవంత్ కు వేర్వేరుగా ఆలయం వద్ద ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించారు. ఆలయానికి వచ్చిన భట్టి విక్రమార్కను బందోబస్తు పర్యవేక్షణకు వచ్చిన అడిషనల్ డీజి సుధీర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.