నేడు సుప్రీంలో విచారణకు కవిత పిటిషన్ - ఈడీపై కేసులో ఏం జరగబోతోంది?
మహిళలను ఇంటి వద్దే విచారించాలని ఐపీసీ సెక్షన్లు చెబుతుంటే ఈడి తనను మాత్రం ఆఫీస్‌కు పిలిచి రాత్రి వరకు విచారించారని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై నేడు(మార్చి27) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తనను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారించడంపై ఆమె పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను తక్షణమే విచారణ జరపాలన్న కవిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మార్చి 24నే విచారిస్తామని చెప్పారు. అయితే జస్టిస్ రస్తోగి, జస్టిస్ త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం నేటికి(సోమవారం) వాయిదా వేసింది. ఇవాళ(సోమవారం) ఐటెమ్ నెంబర్ 36గా కవిత పిటిషన్ లిస్ట్ అయింది.
మహిళలను ఇంటి వద్దే విచారించాలని ఐపీసీ సెక్షన్లు చెబుతుంటే ఈడి తనను మాత్రం ఆఫీస్‌కు పిలిచి రాత్రి 9, 10 వరకు విచారించారని కవిత పిటిషన్ వేశారు. తనపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కూడా అభ్యర్థించారు. అనుమతి లేకుండానే తన ఫోన్‌లు సీజ్ చేశారని పేర్కొన్నారు. వీటన్నింటిపై నేడు విచారణ జరగనుంది.
కవిత వేసిన పిటిషన్‌పై ఈడీ కూడా కౌంటర్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కవిత విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని రిక్వస్ట్ చేసింది. ఇప్పుడు ఈ విచారణలో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాతే కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఈడీ అధికారుల విచారణ తీరును కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ ద్వారా ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం మహిళను ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న తమ విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందని, అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లామని కవిత నిన్న పిటిషన్ వేశారు. అందుకే తాను ఈడీ విచారణకు రాలేదని, సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే విచారణకు వస్తానని ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు తన న్యాయవాది ద్వారా పంపారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలని అన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందన్నారు. మహిళల హక్కులను ఉల్లంఘిస్తోందని అన్నారు. అత్యవసర విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆమె ఈడీ ఎదుట హాజరయ్యారు.
మూడు సార్లు ఈడీ ఎదుట హాజరైన కవిత.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇప్పటికే మూడుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల ముందు హాజరయ్యారు… ఈ నెల 11, 20, 21 తేదీల్లో ఆమె మూడుసార్లు ఈడీ ఎదుట హాజరైన కవిత వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా తన వద్ద ఉన్న 10 ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. కీలక పత్రాలు కూడా సమర్పించారు. అలాగే ఇకపై విచారణకు తాను కాకుండా తన తరుపు న్యాయవాది హాజరయ్యే విధంగా అనుమతి ఇవ్వాలని కోరుతూ అందుకు అవసరమైన డాక్యుమెంట్లను కవిత ఈడీ అధికారులకు అందజేశారు. విచారణ జరిగిన మూడు సార్లు రాత్రి పొద్దు పోయే వరకూ అధికారులు ప్రశ్నించారు.