Cyberabad CP Stephen Ravindra: హైదరాబాద్‌లో మూడు బెట్టింగ్ ముఠాలు అరెస్ట్ , కోట్ల రూపాయల డబ్బులు స్వాధీనం
Cyberabad CP Stephen Ravindra: ఆన్ లైన్ యాప్స్ ద్వారా ఐపీఎల్ బెట్టింగ్ దందాలకు పాల్పడుతున్న మూడు ముఠాలను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
Cyberabad CP Stephen Ravindra: ఆన్ లైన్ యాప్స్ ఉపయోగించి ఐపీఎల్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న మూడు ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వజ్ర ఎక్స్ చేంజ్, మెట్రో ఎక్స్ చేంజ్, రాధ ఎక్స్ ఛేంజ్ వంటి యాప్స్ ఉపయోగించి ఈ బెట్టింగ్ దందా సాగిస్తున్నారని గుర్తించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహించేందుకు ఉపయోగించే యాప్స్ ను బెట్టింగ్ నిర్వాహకులే అందుబాటులో ఉంచుతారు. వాటి యూజర్ నేమ్, పాస్ వర్ట్స్ ఫంటర్లకు పంపించి ఆయా క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం బెట్టింగ్ మొదలు పెడతారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వంటి యూపీఐ సర్వీసుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 2017 ఆన్ లైన్ గేమింగ్ యాక్ట్ ప్రకారం బెట్టింగ్ పై రాష్ట్రంలో నిషేధం ఉండటంతో బెట్టింగ్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు గణపతి రెడ్డి, శ్రీనివాస్ రాజు ఆధ్వర్యంలో ఈ బెట్టింగ్ దందా నడుస్తున్నట్లు గుర్తించారు. ఈ మూడు గ్యాంగ్ లలోని ఏడుగురు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వీరి అకౌంట్ల నుండి 1.84 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
రవి రాజు, వెంకట రామరాజు, ప్రసాద్ రాజు అనే ముగ్గురు బెట్టింగ్ నిర్వాహకులను రాజేంద్ర నగర్ లో అరెస్టు చేశారు. మరో ముఠాకు చెందిన వినోద్ కుమార్, శ్రీకాంత్ రెడ్డిలను బాలానగర్ ఎస్వీటీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో ఉంటూ ఇక్కడ బెట్టింగ్ నిర్వహించే ప్రధాన బుకీ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రెండు నెలల వ్యవధిలోనే 15 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తింట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
20 రోజుల క్రితమే 12 మంది అరెస్ట్
హైదరాబాద్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న పన్నెండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో మరో ఐదుగురు నిందితులు తప్పించుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేష్న పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు వేర్వేరు టీంలో 12 మంది బుకీలు, ఆపరేట్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకోబోతుండగా మరో ఐదుగురు తప్పించుకున్నారు. సులభంగా డబ్బులు సంపాధించడం కోసం ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. నిందితుల్లో వసంత్ కుమార్, పొండూరి వెంకట సాయి, కలిదిండి రామరాజు, K.రమేష్ లు ఒక బెట్టింగ్ సెంటర్ లో.. Ch.కార్తీక్, బాదమ్ వీరేష్, బి.శివ కుమార్, మనోజ్ కుమార్, చంద్ర మోహన్ రావ్, సతీష్ కుమార్, సత్యనారాయణ, రవి వర్మలు మరో బెట్టింగ్ సెంటర్ లో దొరకగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు మేడ్చల్ డీసీపీ సందీప్ రావు తెలిపారు. అయితే వీరి నుంచి అయ్యప్ప, కుమార్, పాండు, షేక్ జిలానీ, ప్రభాకర్ లు పరారు అయినట్లు వెల్లడించారు.
నిందితుల నుంచి పోలీసులు 50 లక్షల రూపాయల నగదుతో పాటు 8 ల్యాప్ టాప్ లో, ఒక ఐఫోన్, 5 లైన్ బోర్డులు, నాలుగు టీవీలు, మూడు కీబోర్డులు, ఒక మౌస్, వైఫై రూటర్, ఇయర్ పాడ్, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ వివరించారు. అలాగే 3 లక్షల 29 వేల రూపాయలను బ్యాంకులో సీజ్ చేశామని చెప్పారు. అయితే స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ కోటి 41 లక్షల 52 వేల 548 రూపాయలు అని స్పష్టం చేశారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని, మిగిలిన ఐదుగురుని కూడా త్వరలోనే పట్టుకుంటామని మేడ్చల్ డీసీపీ సందీప్ రావు వెల్లడించారు.