Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అలర్ట్.. బిల్లుల చెల్లింపుల్లో మార్పులు చేసిన ప్రభుత్వం
తెలంగాణలో అర్హులైన పేదల సొంతింటి కల సాకారం చేయడానికి తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Indiramma Housing Scheme | హైదరాబాద్: పేదల సొంతింతి కల సాకారం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు అందించే బిల్లుల చెల్లింపు విధానంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద 90 పనిదినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (IHHL) పనులను కూడా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో బిల్లుల చెల్లింపుల్లో ఈ మార్పులు చేయక తప్పలేదని వెల్లడించారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్రం నిర్ణయాలతో బిల్లుల చెల్లింపుల్లో మార్పులు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బిల్లుల చెల్లింపుల షెడ్యూల్‌లో (దశల్లో) మాత్రమే మార్పులు జరుగుతాయి. కానీ మొత్తం రూ. 5 లక్షల చెల్లింపులో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా మొదటి దశ పూర్తయ్యాక రూ.1 లక్ష, రెండో దశ పూర్తయిన తర్వాత రూ.1 లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ తొలి 2 దశల చెల్లింపుల్లో ఎలాంటి మార్పులు లేవని, మూడో దశలో బిల్లుల చెల్లింపుల్లో మార్పులు చేశారు. గతంలో మూడో దశలో పని పూర్తయితే లబ్దిదారులకు రూ. 2 లక్షలు చెల్లించేవారు, ఇకపై మూడో దశలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ. 1.60 లక్షలు మాత్రమే ఇవ్వనున్నారు. అందిస్తారు. మిగిలిన మొత్తం రూ. 40 వేలును తర్వాత దశల్లో లబ్దిదారుడి ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ మార్పులు కేవలం పరిపాలన సౌలభ్యం కోసం చేశామని మంత్రి పొంగులేటి వివరించారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం
అర్హులైన నిరుపేదల సొంతింటి ర్హులైన సొంతింటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకొచ్చింది. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు దశలవారీగా ఆర్థిక సాయం చేయనుంది. ఇందుకోసం తొలి దశ నుంచి అధికారులు తనిఖీ చేస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇండ్లు నిర్మించుకునే వారికి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు.






















