Telangana Caste Survey: తెలంగాణ ప్రభుత్వానికి కుల గణన సర్వేపై నివేదికను సమర్పించిన నిపుణుల కమిటీ, నెక్ట్స్ ఏంటి
Telangana News | కుల గణన సర్వే నివేదికపై నియమించిన ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి 300 పేజీలతో కూడిన రిపోర్ట్ ఇచ్చింది.

Independent Expert Working Group | హైదరాబాద్: దేశంలో కుల గణన చేపట్టిన తొలి ప్రభుత్వం తమదే అని తెలంగాణ సర్కార్ చెబుతోంది. కులగణనపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి 300 పేజీల నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణులు శనివారం నాడు (జులై 19న) సమావేశమయ్యారు. వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ కంచె ఐలయ్య, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రవీణ్ చక్రవర్తి, ప్రొఫెసర్ హిమాన్షు, నిఖిల్ డే, డా. సుఖదేవ్ తొరాట్, ప్రొఫెసర్ భాంగ్య భూక్య, ప్రొఫెసర్లు పురుషోత్తం రెడ్డి, జీన్ డ్రెజ్, థామస్ పికెట్టి, సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి ఈ సందర్భంగా తమ నివేదికను అందించారు.
ఈ కులగణన సర్వే సైంటిఫిక్, అథెంటిక్, రిలయబుల్ అని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వే చారిత్రాత్మకమని, ఇది దేశానికి రోల్ మోడల్ గా మారుతుందని నిపుణుల కమిటీ పేర్కొంది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలతో పాటు వారి సూచనలను కేబినెట్ భేటీలో చర్చించి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను కొన్ని నెలల కిందట నిర్వహించింది.

50 రోజుల పాటు తెలంగాణలో సర్వే
మొదటి విడతలో భాగంగా 2024 నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు దాదాపు 50 రోజుల పాటు తెలంగాణలో సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా సమాచారం సేకరించేందుకు ప్రతి జిల్లాలో ప్రతి 150 కుటుంబాలను ఒక బ్లాక్ గా చేసింది. ఒక్కో బ్లాక్ కు ఒక ఎన్యుమరేటర్, ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో ప్రభుత్వం శాస్త్రీయంగా సర్వే చేయించింది. మొదటి విడతలో రాష్ట్రంలో96.9 శాతం కుటుంబాలను సర్వే చేసి ఆయా కుటుంబాల వివరాలను 36 రోజుల్లో డేటా ఎంట్రీ సైతం చేశారు.
తెలంగాణలో సామాజిక వర్గాల వారిగా లెక్కలు
మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు సర్వేలో తమ వివరాలు నమోదు చేయకపోవటంతో ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు రెండో విడతలో అవకాశం కల్పించింది. మీ సేవా కేంద్రాలు, ఎంపీడీవో ఆఫీసులు, జీహెచ్ఎంసీ, వెబ్‌సైట్ ద్వారా వారి వివరాలను ఎంట్రీ చేయించింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం తెలంగాణలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. 1,12,36,849 (97.10 శాతం) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది ఈ సర్వేలో పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీలు 61,91,294 మంది (17.42 శాతం), ఎస్టీలు 37,08,408 మంది (10.43 శాతం), బీసీలు 2,00,37,668 మంది (56.36 శాతం), ఇతర కులాలకు చెందిన వారు 56,13,389 మంది అంటే 15.89 శాతం మంది ఉన్నారు.
కొంతకాలం కిందట ప్రభుత్వం కుల గణన సర్వే చేసింది. సర్వే వివరాల నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది. సర్వే ఫలితాలను అధ్యయనం చేసి విధాన నిర్ణయాలను రూపొందించేందుకు వీలుగారాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్రెడ్డి గారి అధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్ర్య నిపుణుల వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. కుల గణన సర్వే ఫలితాలను విశ్లేషించి వివరణాత్మక నివేదికను అప్పగించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది.
వివిధ దఫాలుగా సమావేశాలు జరిపిన కమిటీ కుల గణన సర్వే డేటాను సేకరించిన పద్దతి సరిగ్గా ఉందని గుర్తించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పనతో పాటు ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగుపరిచేందుకు, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత, వెనుకబడిన బలహీనవర్గాల వర్గాలకు మేలు చేయడానికి కుల గణన నివేదిక సహాయపడుతుందని నిపుణుల కమిటీ సూచించింది.






















