Uppal Stadium: స్టేడియంలో ఈ వస్తువులు బ్యాన్! మీరు తీసుకెళ్తే లోపలికి వెళ్లనివ్వరు - పోలీసుల హెచ్చరిక
టికెట్లు సంపాదించి ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేవారు కొన్ని వస్తువులను స్టేడియంలోనికి తీసుకెళ్లకూడదని రాచకొండ పోలీసులు సూచించారు.
హైదరాబాద్ లో ఇవాళ (సెప్టెంబరు 25) జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చేస్తున్నారు. టికెట్ల అమ్మకం విషయంలో నిర్వహకులు పూర్తిగా విఫలమైనప్పటికీ ఫ్యాన్స్ ఎంతో ఓపిక ప్రదర్శించారు. టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద కిలో మీటర్ల కొద్దీ లైన్ లో నిలబడ్డ సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం టికెట్ల విషయంలో తీవ్ర ఘర్షణ కూడా జరిగింది. ఎలాగోలా కొంత మంది అభిమానులకు టికెట్లు దక్కగా, మరికొంత మంది మాత్రం నిరాశ పడ్డారు.
అయితే, టికెట్లు సంపాదించి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేవారు కొన్ని వస్తువులను స్టేడియంలోనికి తీసుకెళ్లకూడదని పోలీసులు సూచించారు. ఈ విషయం గురించి తరచూ ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే వారికి అవగాహన ఉండొచ్చు కానీ, కొత్తగా స్టేడియంలోకి వెళ్లే అంతగా తెలియదు. స్టేడియంలోకి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం పూర్తి నిషేధం అని రాచకొండ పోలీసులు ట్వీట్ చేశారు. ఆ వస్తువులతో ఎవరైనా స్టేడియంకు వస్తే లోనికి అనుమతించబోరని తేల్చి చెప్పారు.
లోనికి తీసుకెళ్లడం నిషేధించిన వస్తువులు ఇవీ
- కెమెరాలు, రికార్డింగ్ సాధనాలు
- ల్యాప్ టాప్‌లు
- సిగరెట్, లైటర్, అగ్గిపెట్టె
- తుపాకులు, కత్తులు, ఇతర ఆయుధాలు
- వాటర్ బాలిట్స్, మద్యం, ఇతర కూల్ డ్రింకులు
- పెంపుడు జంతువులు
- హెల్మెట్లు
- పటాకులు
- తినే పదార్థాలు
- బ్యాక్ ప్యాక్‌లు
- సెల్ఫీ స్టిక్‌లు
Carrying these items inside the #stadium is strictly #prohibited. #INDvsAUS #3rdt20#INDvsAUST20I #Cricket #T20Cricket #HyderabadCricketAssociation #T20I #RohitSharma #ViratKohli𓃵 #TeamIndia @TelanganaDGP @TelanganaCOPs @BCCI @cyberabadpolice @hydcitypolice @VSrinivasGoud pic.twitter.com/WZYk2Ru2UN
— Rachakonda Police (@RachakondaCop) September 23, 2022
భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా నేడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు పెద్ద ఎత్తున ఉండనున్నాయి. ఉప్పల్ అంతర్జాతీయ స్టేడియానికి ఉదయం నుంచే అభిమానులు చేరుకుంటుండగా.. సాయంత్రం 4 గంటల నుంచి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించనున్నారు. టికెట్లు ఉన్న వారు మాత్రమే రావాలని పోలీసులు సూచించారు. మ్యాచ్ ముగిశాక ఈ సారి TSIIC నుంచి బయటకు వెళ్లేలా మార్గం ఏర్పాటు చేశారు. దీంతో ప్రేక్షకులు త్వరగా బయటకు వెళ్లే అవకాశం ఉంది. తర్వాత వారి గమ్య స్థానాలకు చేరుకొనేందుకు హైదరాబాద్ మెట్రో సర్వీసులు అర్ధరాత్రి దాటే వరకూ నడవనున్నాయి.
2,500 మంది పోలీసులతో భద్రత
ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం దాదాపు 2,500 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మ్యాచ్ నేడు సాయంత్రం జరగనున్నందున మరోసారి బాంబ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.