Hyderabad Tunnel Road: హైదరాబాద్‌లో సొరంగ రోడ్డు మార్గానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Hyderabad Tunnel Road: జూబ్లీహిల్స్ రోడ్‌నెం.45 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్‌నెం.12 వరకు సొరంగ మార్గం నిర్మించనున్నారు. నాలుగు నెలల కిందట ప్రతిపాదన చేశారు అధికారులు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య అధిగమించేందుకు జూబ్లీహిల్స్ రోడ్‌నెం.45 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్‌నెం.12 వరకు సొరంగ మార్గం నిర్మించనున్నారు. ఇందుకోసం దాదాపు నాలుగు నాలుగైదు నెలల కిందటే ప్రతిపాదనలు ఉన్నాయి. తాజాగా ఆ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ సొరంగ రోడ్డు మార్గం దేశంలోనే అతి పొడవైన టన్నెల్ రోడ్డుగా నిలవనుంది. ఇది అందుబాటులోకి వస్తే నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి. దేశంలో ప్రస్తుతం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ (Shyam Prasad Mukhurjee Tunnel)అత్యంత పొడవైనదిగా ఉంది.
నాలుగు నెలల కిందట ప్రతిపాదనలు..
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 జంక్షన్ వరకు టన్నెల్ రోడ్డు నిర్మించేందుకు నాలుగు నెలల కిందట ప్రతిపాదన చేశారు అధికారులు. అయితే ఫీజిబిలిటీ స్టడీ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల కోసం కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ అంతర్జాతీయస్థాయి టెండర్లను ఆహ్వానించారు. మూడు సంస్థలు లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్, ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్ ఇంజినీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, SMEC ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు టెండర్‌లో పాల్గొని బిడ్ దాఖలు చేయగా ఎల్1గా నిలిచిన ఆర్వీ అసోసియేట్స్ (Aarvee Associates Engineers and Consultants Pvt. Ltd)కు పనులు అప్పగించాలని జీహెచ్ఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టుకు అనుమతినిచ్చింది. ఫీజిబిలిటీ స్టడీ, రూ. 2.92 కోట్లతో డీపీఆర్‌కు ఖర్చు కాగా, రూ.68.44 లక్షలతో సొరంగ మార్గం నిర్మించనున్నారు. మొత్తం వ్యవం దాదాపు రూ.3.61 కోట్లు కానుంది.
రెండు దశలలో పనులు
రెండు దశలలో పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదట ఫీజిబిలిటీ స్టడీ, ఆపై డీపీఆర్‌లు రెండు దశలుగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫీజిబిలిటీ స్టడీ నివేదిక వచ్చాక, రిపోర్ట్ పరిశీలించిన తరువాత డీపీఆర్ తయారీ (Detailed Project Report) రూపొందించాలని అధికారులకు సూచించింది. ఫీజిబిలిటీ స్టడీకి ఆరు నెలల గడువు ఇచ్చింది. అనంతరం డీపీఆర్‌కోసం మరో మూడునెలల సమయం పడుతుందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. తొలి ప్రతిపాదనల మేరకు దాదాపు 10 కి.మీ మేర సొరంగమార్గం నిర్మించాలనుకున్నారు. అయితే 6.30 కి.మీకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12 నుంచి టన్నెల్ జాయినింగ్ పాయింట్ వరకు: 1.10 కి.మీ.
జూబ్లీహిల్స్ రోడ్డు రోడ్‌నెంబర్ 45 జంక్షన్ నుంచి కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్ వరకు 1.70 కి.మీ...
కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ నుంచి ఎన్ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు 2 కి.మీ..
మూడు అప్రోచెస్ 0.50 కి.మీ చొప్పున మొత్తం 1.5 కి.మీ. టన్నెల్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు.
సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా..
అప్రోచ్ రోడ్లతో పాటు టన్నెల్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాల్సింది ఉంది. లైటింగ్, వెంటిలేషన్, భద్రత, నిర్వహణ అవసరాలు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకోవాలి. టన్నెల్ ఏర్పాటు, అప్రోచ్ రోడ్ల రూపకల్పన, భూకంప రక్షణ చర్యలు, సర్వీస్ రోడ్లు, కూడళ్లు, పునరావాసం, విస్తరణ మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్ట్ సాంకేతిక, ఆర్థిక సాధ్యతను పరిశీలించాలి. కొన్ని సంవత్సరాల క్రితం, ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలుపుతూ ఈఎస్జెడ్ కింద వచ్చే పార్కు మొదటి సరిహద్దు గోడ లోపల చెట్లను నరకకూడదని GHMCకి చెప్పింది. రెండో సరిహద్దు గోడ వెలుపల ఉన్న చెట్లు ESZ కిందకు రావని పేర్కొంది. దీంతో చెట్లను నరికివేయకుండా భూగర్భ సొరంగం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. GHMC అధికారులు మాట్లాడుతూ సిటీలో ముఖ్యమైన ప్రదేశాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి సిగ్నల్ రహిత కూడళ్ల ఏర్పాటు చేసే లక్ష్యంతో SRDP రూపొందించామన్నారు. SRDPలో భాగంగా దుర్గం చెరువు వద్ద తీగల వంతెనతో సహా రోడ్ నంబర్ 45, మైండ్‌స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్‌లోని ఫ్లైఓవర్ వంటి వివిధ ప్రదేశాలలో అనేక గ్రేడ్ సెపరేటర్లను నిర్మించారు. SRDP ఫ్లైఓవర్లు, తీగల వంతెన నిర్మాణం వల్ల పంజాగుట్ట, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 అనేక జంక్షన్లలో రోజువారీ ట్రాఫిక్ రద్దీ నుంచి కొంత ఉపశమనం కలిగించింది.