Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు
KIMS Hospital In Secunderabad: హైదరాబాద్ లో గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు గచ్చిబౌలి కిమ్ హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్‌కు 18 నిమిషాల్లో గుండె తరలించారు.
Green Channel in Hyderabad: హైదరాబాద్ పోలీసులు మరోసారి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి గ్రేట్ అనిపించుకున్నారు. సాటి మనిషి ప్రాణం కాపాడేందుకు తమ వంతు సాయం అందించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని మరోసారి నిరూపించుకున్నారు. గతంలో ఎన్నోసార్లు నగరంలోని ఓ చోటు నుంచి మరోచోటుకు, తెలంగాణ నుంచి ఏపీకి సైతం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి పేషెంట్ల ప్రాణాలు కాపడిన పోలీసులు తాజాగా మరోసారి అవయవం త్వరగా తరలించి శభాష్ అనిపించుకున్నారు.
గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు..
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లైవ్ ఆర్గాన్ (గుండె) అవయవాన్ని తీసుకువెళుతున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు నేడు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. తద్వారా లైవ్ ఆర్గాన్ ను అతివేగంగా రవాణా చేయడాన్ని సులభతరం చేశారు. సైబరాబాద్‌లోని గచ్చిబౌలిలోని కిమ్స్ ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి గుండెను 18 కిలోమీటర్ల దూరం ఉన్నా కేవలం 18 నిమిషాల్లో తరలించారు. ఇందుకోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేశారు.
లైవ్ ఆర్గాన్ (Heart)తో వైద్య బృందం గచ్చిబౌలిలోని కిమ్స్ ఆసుపత్రి నుంచి ఉదయం 10.02 గంటలకు బయలుదేరి ఉదయం 10.20 గంటలకు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. దాంతో గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ కు కేవలం 18 నిమిషాల్లో గుండెను తరలించి పేషెంట్ ఆపరేషన్‌కు సహకరించారు. లైవ్ ఆర్గాన్స్ రవాణాలో తోడ్పాటు అందించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను కిమ్స్ హాస్పిటల్స్ నిర్వాహకులు ప్రశంసించారు. ఈ ఏడాది 2022లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 34 సార్లు అవయవ రవాణాను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత వేగంగా గుండె లేదా ఇతర ముఖ్యమైన అవయవాలను తరలించి అవసరమైన పేషెంట్ కు ఆపరేషన్ చేసి అమర్చడం ద్వారా ఓ ప్రాణాన్ని కాపాడవచ్చు.
రెగ్యూలర్‌గా గ్రీన్ ఛానెల్ ద్వారా సేవలు..
ఈ ఏడాది జనవరి నెలలోనూ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి నుంచి బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి రాచకొండ పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. గుండె, ఊపిరితిత్తులను గ్రీన్ ఛానెల్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో 17.6 కిలోమీటర్ల దూరానికి లైవ్ ఆర్గాన్స్ తరలించడంతో విజయవంతమయ్యారు. ఈ ఏడాది జూన్ నెలలోనూ గ్రీన్ ఛానల్ ద్వారా మూడు కిలోమీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో రీచ్ అయ్యేలా పక్కాగా ప్లాన్ చేశారు. ట్రాఫిక్ పోలీసుల సాయంతో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి కిమ్స్ ఆసుపత్రికి గుండెను నిర్వాహకులు తరలించారు. అదే విధంగా సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ నుంచి ఊపిరితిత్తులను మలక్‌పేట్ యశోద ఆసుపత్రికి డాక్టర్ల టీమ్ తరలించడంలో సక్సెస్ అయింది. గ్రీన్ ఛానల్ ద్వారా 12 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 12 నిమిషాల్లోనే అంబులెన్స్ చేరుకునేలా చేశారు. ఇలా పలు సందర్భాలలో హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్లాన్ ప్రకారం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి అవయవాల తరలింపునకు తోడ్పాటు అందిస్తున్నారు. తద్వారా ఎంతో మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడటంతో వారి వంతు పాత్ర పోషిస్తున్నారను అని అధికారులు, నగర ప్రజలు ప్రశంసిస్తున్నారు.