Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై ఇద్దరు యువకుల సెల్ఫీ, ఇంతలో ఊహించని ప్రమాదం - ఒకరు దుర్మరణం
Hyderabad News: అర్ధరాత్రి సెల్ఫీ దిగుతున్న ఇద్దరు యువకులను ఓ కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు బాగా గాయాలపాలు అయ్యారు.
Cable Bridge News: హైదరాబాద్ లోని దుర్గం చెరువు పైగల తీగల వంతెనపై మరో ప్రమాదం జరిగింది. సెల్ఫీ తీసుకొనే మోజులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిత్యం పర్యటకులతో రద్దీగా ఉండే దుర్గం చెరువు బ్రిడ్జిపై నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు తొలి నుంచి హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొందరు సందర్శకులు నిర్దేశించిన ఫుట్ పాత్ పై కాకుండా.. వంతెనపై వాహనాలు వెళ్లే రహదారికి ఇరు వైపులా ఫోటోలు దిగేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.
తాజాగా అర్ధరాత్రి సెల్ఫీ దిగుతున్న ఇద్దరు యువకులను ఓ కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు బాగా గాయాలపాలు అయ్యారు. మాదాపూర్ పోలీసులు ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు వెల్లడించారు. ప్రమాదానికి గురైన ఇద్దరు వ్యక్తులు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరు తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలానికి చెందిన ఎస్. అనిల్ కుమార్ అనే 27 ఏళ్ల వ్యక్తి. ఇతను డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తన భార్య విజయతో కలిసి మాదాపూర్ చంద్రానాయక్ తండాలో నివాసం ఉంటున్నాడు. అతని స్నేహితుడు కొమరపు అజయ్ అనే 25 ఏళ్ల వ్యక్తి సాయిబాబానగర్‌లో ఉంటూ ఓ కిరాణా షాపులో పని చేస్తున్నాడు.
వీరిద్దరూ శుక్రవారం (ఏప్రిల్ 5) అర్ధరాత్రి 12.30 సమయంలో కేబుల్ బ్రిడ్జి చూసేందుకు వచ్చారు. వారు తమ బైక్ ను వంతెనపైనే ఓ పక్కన నిలిపి.. రోడ్డుపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇంతలో ఇనార్బిట్ మాల్ వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ కుమార్‌ను కారు కొద్ది దూరం ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పారిపోయాడు. అనిల్‌కు బలమైన గాయాలు కాగా అజయ్‌కు ముఖంపై, కాళ్లకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.
స్థానికులు, తోటి సందర్శకులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనిల్ కుమార్ చనిపోయినట్లుగా డాక్టర్లు వెల్లడించారు. ప్రమాద స్థలంలో దొరికిన వాహనం నంబర్ ప్లేట్‌ను పరిశీలించిన పోలీసులు కారు యజమాని కోసం గాలించారు. అతను బంజారాహిల్స్‌లోని ఇబ్రహీంనగర్‌కు చెందిన వెంకట్ రెడ్డి అని గుర్తించారు. కారును వెంకట్ రెడ్డి శుక్రవారం ఇతరులకు ఇచ్చినట్లు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. నడిపింది ఎవరనే విషయం తమ విచారణలో తేలుతుందని మాదాపూర్ పోలీసులు వెల్లడించారు.
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2024
నగరం నడిబొడ్డున మరో హిట్ అండ్ రన్ కేసు
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఢీకొట్టిన కారు, అక్కడిక్కడే మృతి చెందిన అనిల్ అనే యువకుడు, మరో యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు..
సీసీ… pic.twitter.com/qQdSI2HxEU