Hyderabad Crime News: అదిరిపోయే ఆఫర్- లక్ష కడితే 4 కోట్లు లాభం!
Hyderabad Crime News: లక్ష కడితే 4 కోట్లు ఇస్తామని మోసం చేసిన కేసులో పోలీసులు విచారణ సాగుతోంది. ఇందులో జైళ్ల శాఖ సిబ్బంది, అధికారులూ మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.
Hyderabad Crime News: గొలుసు కట్టు వ్యాపారాలు చేసి వేలాది మందిని మోసం చేశారన్న వార్తలు తరచూ వార్తల్లో కనిపిస్తూ, వినిపిస్తూనే ఉంటాయి. 100 రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు ఇస్తామంటూ నమ్మబలికి వేలాది మంది వారి దగ్గర డబ్బు పెట్టగానే ఉడాయించిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి వార్తలు ఎన్ని వస్తున్నా, మోసపోయిన ఉదాహరణలు ఎన్ని కనిపిస్తున్నా బాధితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చదువులేని వారితో పాటు ఉన్నత విద్య చదువుకున్న వారు కూడా ఇలాంటి మోసాల్లో చిక్కుకుంటున్నారు. డబ్బు అనే వీక్ పాయింట్ ను పట్టుకుని దానితో వారిని ఈజీగా మోసం చేసేస్తున్నారు.
తర్వాత ఇస్తామంటే నమ్మి వెళ్లిపోయిన బాధితులు
లక్ష కడితే 4 కోట్లు ఇస్తామన్నారు. రోజూ 2.5 శాతం అంటే రూ.2,500 కమీషన్ ఇస్తామని చెప్పారు. 240 రోజుల తర్వాత రూ.4.21 కోట్లు చెల్లిస్తామని నమ్మబలికారు. ఇంకొకర్ని ప్రోత్సహించి డబ్బు కట్టేలా చేస్తే రోజూ ఇచ్చే కమీషన్ కు అదనంగా మరో రూ.700 ఇస్తామని చెప్పారు. ఈ మోసం వెనక జైళ్ల శాఖ సిబ్బంది, నగరంలోని ఓ జైలులో గతంలో రిమాండ్ లో ఉన్న వ్యక్తి ఉన్నారు. వీరి వలలో దాదాపు 9 వేల మంది పడ్డారు. వారికి చెరో లక్ష రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఈ మోసంపై మీడియాలో, వార్తా పత్రికల్లో రావడంతో బాధితులు తమ డబ్బులు ఎక్కడ పోతాయోననే భయంతో హబ్సిగూడలోని సంస్థ ఆఫీస్ కు వెళ్లి ఆందోళనకు దిగారు. శని, ఆదివారాల్లో బ్యాంకు సెలవు అని సోమవారం డబ్బంతా డ్రా చేసి ఇస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆందోళన చేస్తున్న వారంతా అక్కడి నుండి వెళ్లి పోయారు.
9 వేల మంది బాధితులు
నిర్వాహకులు చెప్పినట్లుగా సోమవారం హబ్సిగూడలోని కార్యాలయానికి చేరుకోగానే అసలు విషయం బోధపడింది. అప్పటికే నిర్వాహకులు ఉడాయించినట్లు తెలుసుకున్నారు. అక్కడి నుంచి నాంపల్లిలోని సీసీఎస్ పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మోసం వ్యవహారంలో జైళ్ల శాఖ సిబ్బంది 200 మంది సుమారు రూ. 2 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లోని జైళ్లలోని సిబ్బంది నుంచి అధికారుల వరకు అందరూ డబ్బు కట్టినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా డబ్బు పెట్టిన వారి సంఖ్య 9 వేల మంది వరకూ ఉంటుందని తెలుస్తోంది. బాధితులు కట్టిన డబ్బుతో ట్రేడింగ్ చేస్తామని అలా వారికి వచ్చిన లాభాలను అందరికీ పంచుతామని చెప్పినట్లు వెల్లడించారు.
హబ్సిగూడ కార్యాలయంలో బాధితులను నమ్మించేందుకు నిత్యం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చే వారు. బాధితులు కట్టిన డబ్బులు లెక్కించి కట్టలు కట్టి.. సంచుల్లో నింపేవారని తెలిపారు. ఆ సంచులను కార్లలో తరలించే వారని బాధితులు వెల్లడించారు. నకిలీ కంపెనీ అధినేత, ఈ మోసానికి సూత్రధారి అయిన వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు