Hyderabad Metro Offer: మెట్రో ప్రయాణికులకు భారీ ఆఫర్, రోజంతా ఎన్నిసార్లైనా, ఎక్కడికైనా - ఈ రోజుల్లోనే
Hyderabad Metro: రూ.59 ధర చెల్లించి ఒక రోజులో ఎక్కడి నుంచి మరెక్కడికైనా ఎన్నిసార్లైనా తిరిగే వెసులుబాటు కల్పించింది.
Hyderabad Metro Rail Offers: హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (Hyderabad Metro Rail) జనం మెచ్చే సరికొత్త భారీ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.59 ధర చెల్లించి ఒక రోజులో ఎక్కడి నుంచి మరెక్కడికైనా ఎన్నిసార్లైనా తిరిగే వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ ఆఫర్ అన్ని రోజుల్లో వర్తించదు. కొన్ని నిర్దేశిత సెలవు రోజుల్లో మాత్రమే వర్తించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ‘సూపర్ సేవర్ కార్డు’ (Super Saver Card) పేరుతో ఈ ఆఫర్‌ను ప్రవేశపెడుతున్నట్లుగా ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు. ఈ సూపర్ సేవర్ కార్డును ఆయనే గురువారం ప్రారంభించారు.
ఈ కార్డుతో సెలవుల్లో కేవలం రూ.59 చెల్లించి రోజంతా మెట్రో రైలులో ప్రయాణించవచ్చని కేవీబీ రెడ్డి వెల్లడించారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు.
ఆ సెలవు రోజులు ఏంటంటే..
నెలలో ప్రతి ఆదివారం, ప్రతి రెండోది, నాలుగో శనివారం రోజులు సెలవులుగా పేర్కొంది. అంతేకాక, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, డిసెంబరు 26 బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కేవీబీ రెడ్డి తెలిపారు.
కరోనా తర్వాత మెట్రో పుంజుకుంటోంది: NVS Reddy
కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ తర్వాత మళ్లీ హైదరాబాద్ మెట్రో గాడిలో పడుతోందని L & T Metro ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఎక్కువ రోజులు రైళ్లను నిలిపివేయడంతో పాటు, నడిచిన సమయంలోనూ చాలా రోజుల వరకూ ప్రయాణికులు మెట్రో రైళ్లు ఎక్కడంపై ఆసక్తి చూపించలేదని గుర్తు చేశారు. దీంతో మెట్రో సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. కానీ కొంతకాలంగా మళ్లీ ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం మళ్లీ 60 శాతం రద్దీ పెరిగిందని తెలిపారు. ప్రయాణికులంతా మెట్రో సూపర్ సేవర్ కార్డును ఉపయోగించుకోవాలని సూచించారు.
కరోనాకు ముందు రోజుకి 4 లక్షల ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేవారని, ఇప్పుడు అందులో 70 శాతం అంటే 2.8 లక్షల మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రోజుకు 5 నుంచి 6 లక్షల ప్రయాణికులే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు మెట్రో పాసింజర్స్‌ను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి సువర్ణ ఆఫర్ కింద విజేతలుగా ప్రకటించారు. వారికి గిఫ్టులు అందజేశారు.