Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
హైదరాబాద్‌లో కలకలం రేపిన నీరజ్ పన్వార్ పరువు హత్యపై గోశామహల్ ఏసీపీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. నీరజ్ పన్వార్ మర్వాడీ అబ్బాయి అని, సంజన యాదవ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని తెలిపారు.
ఇటీవల నాగరాజు అనే యువకుడు పరువు హత్యకు గురి కాగా, అంతలోనే హైదరాబాద్‌లో మరో పరువు హత్య జరగడం కలకలం రేపుతోంది. బేగం బజార్ మచ్చి మార్కెట్‌లో నీరజ్ పన్వార్ అనే యువకుడ్ని కత్తులతో పొడిచి, రాళ్లతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. మొత్తం ఐదుగురు నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లో కలకలం రేపిన నీరజ్ పన్వార్ పరువు హత్యపై గోశామహల్ ఏసీపీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. నీరజ్ పన్వార్ మర్వాడీ అబ్బాయి అని, సంజన యాదవ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని తెలిపారు. కొంతకాలం పాటు ప్రేమించుకున్న వీరు గత ఏడాది ఆర్య సమాజ్‌లో కులాంతర వివాహం చేసుకున్నారని ఏసీపీ వెల్లడించారు. వీరి లవ్ మ్యారేజీకి పెద్దలు అంగీకారం తెలిపలేదు. ముఖ్యంగా సంజన కుటుంబసభ్యులు ఈ పెళ్లిని వ్యతిరేకించారు.
ఏడాదిన్నర కింద వీళ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. నీరజ్, సంజన దంపతులకు ప్రస్తుతం నాలుగు నెలల బాబు ఉన్నాడు. కులాంతర వివాహంతో పరువు పోయిందని భావించిన అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులు నీరజ్‌పై కక్షగట్టారు. ఎలాగైనా అంతం చేయాలని ప్లాన్ చేసుకుని , అందులో భాగంగానే కాపుకాసి అతడ్ని కత్తులతో పొడిచి, దాడిచేసి హత్య చేశారని గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్ తెలిపారు. అమ్మాయి సంజన వారి కుటుంబ సభ్యులే నీరజ్ ను హత్య చేశారని ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు.
మృతుడు తండ్రి ఫిర్యాదు
తన కుమారుడు నీరజ్ పన్వార్‌ను సంజన తరఫు బంధువులు హత్య చేశారని అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య కేసులో ఐదుగురు ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. పలు కోణాల్లో కేసు దర్యాప్తు జరుపుతున్నామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అసలేం జరిగిందంటే..
ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్న నాగరాజు పరువు హత్య మరవకముందే నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ బేగం బజార్ లోని మచ్చి మార్కెట్ వద్ద నీరజ్ పన్వార్ అనే ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కత్తులు, రాళ్లతో దాడికి పాల్పడి వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. బేగం బజార్ షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీరజ్ పన్వార్ అనే యువకుడు బైకుపై వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు అతడ్ని అడ్డుకున్నారు.
బైక్ ఆపిన వెంటనే తమ వెంట తెచ్చుకున్న కత్తులతో నీరజ్ పన్వార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. కొందరు రాళ్లతో కూడా యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దాదాపు 20 సార్లు కత్తితో పొడవడంతో నీరజ్ పన్వార్ కుప్పుకూలిపోయి అక్కడే మరణించాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో పగ పెంచుకున్న యువతి బంధువులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏడాది కిందట నీరజ్ పన్వార్ ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
Also Read: Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం