Hyderabad: తక్కువ రేటుకే ఫారిన్ లిక్కర్! న్యూఇయర్‌కి స్పెషల్ ఆఫర్లట - టెంప్ట్ అయ్యారో ఇక అంతే
విదేశీ మద్యం తక్కువ ధరకే వస్తుందని అంటూ రకరకాల మెసేజీలతో ఆకట్టుకుని ఆ తరవాత బ్యాంకు ఖతాను ఖాళీ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
అరచేతిలో ప్రపంచం, ఏదైనా ఒక్క క్లిక్ తో ఇంటి గుమ్మానికి చేరే ఈ కాలంలో ప్రతి రోజు సరికొత్త ఎత్తుగడలతో అమాయకుల సొమ్ము కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. విదేశీ మద్యం తక్కువ ధరకే అన్న ఆఫర్లతో, ఖరీదైన రెస్టారెంట్ లలో తక్కువ ధరకే టేబుల్ బుకింగ్ అని ఆకర్షనీయమైన ఆఫర్లను సోషల్ మీడియా వేదికగా, మెసేజీలను పంపుతున్నారు. ఇప్పటికే డిసెంబరు 31 వేడుకల కోసం చాలా మంది ప్రీ ప్లాన్ తో ముందుకెళ్లడం సహజమే. అయితే, అలా వెతుకులాటలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అందమైన అమ్మాయిలతో కాల్స్ చేయించడం, విదేశీ మద్యం తక్కువ ధరకే వస్తుందని అంటూ రకరకాల మెసేజీలతో ఆకట్టుకుని ఆ తరవాత బ్యాంకు ఖతాను ఖాళీ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఒక్క క్లిక్ నొక్కారో ఇక అంతే సంగతులని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాల్లో తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు అంటున్నారు.
అయితే హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, సరికొత్తగా టెక్నాలజీతో సమానంగా ఏ మాత్రం అనుమానం కలిగించకుండా ఉండే విధంగా సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు మెసేజ్‌లు, కాల్స్ తో తీయగా మాట్లాడి బురిడి కొడతారు. అలాగే ఇయర్ ఎండింగ్ సందర్బంగా మద్యానికి డిమాండ్ ఉంటుంది. అలాంటి వాళ్లను టార్గెట్ చేస్తూ ఎలాంటి ఆఫర్లకైతే వారు ఆకర్షితులు అవుతారో అలాంటి ఆఫర్లను పంపించి నమ్మిస్తున్నారని పోలీసులు చెప్పారు.
ఎనీ డెస్క్, టీం వ్యువర్ ఆప్స్ డౌన్లోడ్ చేయమని చెప్పి నమ్మించే విధంగా తీయగా మాట్లాడతారు. ఇదే సమయంలో ఖరీదయ్యే మద్యం బాటిళ్లు, రెస్టారెంట్ లలో కాస్ట్‌లీ టేబుల్ బుకింగ్‌పై 50 శాతం డిస్కౌంట్ అని నమ్మించి లింక్ క్లిక్ చేయమని చెప్తారు. ఆ లింక్స్ పైన గనుక క్లిక్ చేస్తే మన ఆన్‌లైన్ లావాదేవీలన్ని మోసగాళ్ల చేతిలో చేరుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఆఫర్ ల పేరుతో వచ్చే మెసేజీల్లో ఉన్న లింకులు క్లిక్ చేయకుండా ఉండాలని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా తెలియకుండా అలాంటి లింక్ లు క్లిక్ చేస్తే గనుక 1930 అనే నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.