Hyderabad Crime News: నాన్న ఎమ్మెల్సీ, నేను కాబోయే పార్టీ అధ్యక్షుడినంటూ యువకుడి మోసం - 28 లక్షలు స్వాహా!
Hyderabad Crime News: నాన్న ఎమ్మెల్సీ, తాను కాబోయే పార్టీ అధ్యక్షుడినంటూ ఓ ఐటీ సంస్థ నిర్వాహకుడి వద్ద నుంచి 28 లక్షలు దోచేశాడో యువకుడు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.
Hyderabad Crime News: తన తండ్రి అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్సీ అని తాను వెస్సాఆర్టీపీకి కాబోయే హైదరాబాద్ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఇంటి సంస్థ నిర్వాహకుడి వద్ద నుంచి 28 లక్షల రూపాయలు దోచేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
28 ఏళ్ల సూర్య వంశీ ప్రకాశ్ అనే ఓ వ్యక్తి అమీర్ పేటలో జీపీఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థ నిర్వహిస్తున్నాడు. గతేడాది జులైలో 30 ఏళ్ల కార్తీక్ రెడ్డి అనే వ్యక్తి సూర్యవంశీని కలిశాడు. తన తండ్రి రామ్మోహన్ రెడ్డి ఏపీలో ఎమ్మెల్సీ అని, తాను కాబోయే వైఎస్సార్ తెలంగాణ పార్టీ నగర అధ్యక్షుడినని చెప్పుకున్నాడు. జీపీఎస్ ఇన్ఫోటెక్ కార్యాలయంలో తనకు కొంత భాగం అద్దెకు ఇవ్వాలని కోరాడు. ఇందుకు అంగీకరించిన సూర్యవంశీ ప్రకాశ్ నెలకు 15 వేల రూపాయల చొప్పున తన కార్యాలయంలోని కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చాడు. అడ్వాన్స్ గా 40 వేల రూపాయలను తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇదే అదనుగా తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి ఒకసారి సూర్యవంశీ వద్ద 86 వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు.
మరోసారి కార్తీక్ రెడ్డి తండ్రిగా చెప్పిన రామ్మోహన్ రెడ్డి పేరిట మరో వ్యక్తి సూర్య వంశీ ఫోన్ లో మాట్లాడాడు. తాను ఎమ్మెల్సీనని, ఏపీ, తెలంగాణలో చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పాడు. అత్యవసరంగా నగదు అవసరం అని చెప్పడంతో విడతల వారీగా 26.95 లక్షల రూపాయలు కార్తీక్ రెడ్డికి ముట్టజెప్పాడు. తర్వాత తీసుకున్న అప్పు డబ్బులను ఎంతకీ తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు కార్తీక్ రెడ్డి గురించి ఆరా తీశాడు. కార్తీక్ రెడ్డి అమీర్ పేటలోని అంకమ్మబస్తీ నివాసి అని, అతనితోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడుతుంటారని గుర్తించాడు. మంగళవారం ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ సీఎం ఓఎస్డీ కేఎన్ఆర్ పేరిట కాల్స్
శ్రీకాకుళం జిల్లా బుడుమూరు నాగరాజు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డీ కేఎన్ఆర్ పేరిట ఫోన్ కాల్స్ చేస్తూ.. లక్షల్లో కాజేశాడు. మంగళవాకం జాతీయ రహదారిపై స్కూటీ మీద తిరుగుతూ అక్రమంగా గంజాయి తరలిస్తున్న కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాయి. అయితే పోలీసులు ఇతడిని విచారించగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చా యి. అయితే బుడుమూరు నాగరాజు చెడు వ్యసనాలకు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఎలాగైనా అక్రమంగా డబ్బు సంపాదించాలని చెడు ఉద్దేశంతో ఈ తరహా మోసాల చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అలాగే ఇంటర్ నెట్ లో గూగుల్ సెర్చ్ ద్వారా వివిధ కార్పొరేట్ కంపెనీలు, వాటి సీఈఓలు అయా కంపెనీలు ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్స్ జాబితాను సేకరించేవాడు. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఏస్డీ కె నాగేశ్వరరావు పేరుతో పాటుగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేటిఆర్ పీఏ మాట్లాడుతున్నానని నమ్మబలికి, బెదిరింపులకు పాల్పడి వివిధ కార్పొరేట్ కంపెనీలు సీఈఓ, మేనేజర్ ల వద్ద నుంచి పెద్ద మొత్తంలో లక్షల రూపాయలను కాజేసినట్లు వివరించారు.