Hyderabad: ఉప్పల్ స్టేడియం కరెంట్ బిల్లులు క్లియర్ - TSSPDCLకి చెక్ ఇచ్చిన హెచ్‌సీఏ, అమౌంట్ ఎంతో తెలుసా
HCA President Jagan Mohan Rao | పదేళ్లుగా పెండింగ్ ఉన్న ఉప్పల్ క్రికెట్ స్టేడియం కరెంట్ బిల్లులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం చెల్లించింది. TSSPDCLతో వివాదానికి చెక్ పెట్టింది.
Uppal stadium Power Bills | హైదరాబాద్: తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL)తో గత పదేళ్లుగా నడుస్తున్న విద్యుత్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) శాశ్వత ముగింపు పలికింది. దాదాపు పదేళ్ల కింద మొదలైన వివాదాన్ని పరిష్కరించామని HCA అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు (HCA President Jagan Mohan Rao), కార్యదర్శి దేవ్‌రాజ్ నేతృత్వంలో కార్యవర్గం తెలిపింది. 2015లో పురుడు పోసుకున్నా ఈ విద్యుత్ వివాదానికి శుభం కార్డు వేశామన్నారు. ఉప్పల్ స్టేడియం మొత్తం విద్యుత్ బిల్లు రూ.1.64 కోట్ల బకాయిగా ఉండగా, ఐపీఎల్ సమయంలో మొదటి విడతగా రూ.15 లక్షలు చెల్లించామని తెలిపారు.
మిగిలిన బకాయి మొత్తం మరో 4-5 వాయిదాల్లో చెల్లిద్దామనుకున్నప్పటికీ.. హెచ్‌సీఏ (HCA) పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అంతా చెల్లించినట్లు చెప్పారు. టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీకి మంగళవారం నాడు రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521 (రూ.1.48 కోట్ల)ల మొత్తాన్ని చెక్ రూపంలో అందించినట్టు చెప్పారు.
ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి
విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందనే కారణంతో ఐపీఎల్ 2024 సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ కట్ చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎండీ ఫరూఖీని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు కోరారు. దాదాపు 10 ఏళ్ల కిందట మొదలైన విద్యుత్ బకాయిల సమస్యకు తమను బాధ్యులను చేస్తూ ఐపీఎల్ టైమ్ లో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పారు. దాంతో జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లు ఇబ్బంది పడడంతో పాటు జాతీయ స్థాయిలో హెచ్‌సీఏ పవర్ బిల్లుల వివాదం సంచలనమైంది. కనుక ఇందుకు కారణాలపై విచారణ జరిపి, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.