(Source: Poll of Polls)
Diwali Celebrations: ఆ టైం దాటి క్రాకర్స్ కాల్చితే జైలుకే, ఈ ఏరియాల్లో నిషేదం - హైదరాబాదీలకు సీపీ హెచ్చరిక
Hyderabad Diwali Celebrations: దీపావళి వేడుకల నిర్వహణ గురించి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు సీపీ సందీప్ శాండిల్య కీలక సూచనలు చేశారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడంపై నిషేధం ఉంటుందన్నారు.
Diwali Celebrations in Hyderabad: దీపావళి వేడుకల నిర్వహణ గురించి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య కీలక సూచనలు చేశారు. దీపావళి పండుగ వేడుకల సందర్భంగా రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడంపై నిషేధం ఉంటుందన్నారు. ఎవరైనా ఉల్లంఘించి పేల్చితే చర్యలు తప్పవని శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బహిరంగ రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ధ్వనిని విడుదల చేసే పటాకులు పేల్చడంపై పూర్తి నిషేధం విధించినట్లు చెప్పారు. ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
పండుగ సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10:00 గంటలకు బాణ సంచా కాల్చుకునేందుకు అనుమతి ఉందన్నారు. క్రాకర్లు, డ్రమ్స్, ఇతర పరికరాల నుంచి వచ్చే శబ్దం స్థాయి కాలుష్య నియంత్రణ మండలి పరిమితులను మించకూడదన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులు 12 తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
సుప్రీం కోర్టు ఏం చెప్పిదంటే?
పండుగల సమయంలో వాయు, శబ్ధ కాలుష్యాన్ని తగ్గించడంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేలా రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. దీనిపై కొత్తగా ఎటువంటి ఆదేశాలు అవసరం లేదని తెలిపింది. బాణసంచాలో బేరియం సహా.. నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమంతటా వర్తిస్తాయని తెలిపింది. వాటిని స్పష్టంగా గమనించాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి
2018లో ఇచ్చిన ఆదేశాలను అనుసరించి గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఉందని స్పష్టం చేసింది. వాటిని కూడా దీపావళి వంటి పర్వదినాల్లో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే కాల్చుకోవచ్చని తెలిపింది. ఏదైనా నిషేధిత రసాయనాలతో నిర్దిష్ట ప్రాంతంలో తయారు చేయడం, విక్రయించడం, ఉపయోగిస్తున్నట్లు తేలితే సంబంధిత రాష్ట్రాలే బాధ్యులని స్పష్టం చేసింది.
బేరియం, ఇతర నిషేధిత రసాయనాలతో కూడిన బాణసంచా నిషేధం కేవలం దేశ రాజధాని ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది. అది అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొంది. అతి తక్కువ కాలుష్య ఉద్గారాలు, వాయు, శబ్ధ కాలుష్యం విడుదల చేసే పర్యావరణహిత బాణసంచాను మాత్రమే అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని పేర్కొంది.
పర్యావరణాన్ని కాపాడటం ప్రతిఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే బాణసంచా అమ్మకాలు, కొనుగోలుపై నిషేధం విధించలేమని పేర్కొంది. టపాసులు పేల్చడంపై ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది. పిల్లల కంటే పెద్దలే క్రాకర్స్ ఎక్కువగా కాలుస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.