Eatala Rajender: నేను కొట్టిన దెబ్బకు సీఎం రాజీనామా చేస్తారనుకున్నా- ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
Hyderabad: ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు.
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నుంచి తమను అక్రమంగా సస్పెండ్ చేసిన వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్పీకర్ పాటించడం లేదని నిరసిస్తూ బీజేపీ నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పలువురు దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఇందిరాపార్కు వద్దకు తరలి వచ్చారు. దీంతో అక్కడ పోలీసులు ఎక్కువగా మోహరించారు. చుట్టూ బారీకేడ్లను కూడా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిరసనగానే ఈ దీక్ష చేపట్టామని ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కేసీఆర్ ఆలోచనలకు వ్యతిరేకంగా కూడా ఈ నిరసన చేపట్టామని వెల్లడించారు. హుజూరాబాద్‌లో తన లాంటి ఉద్యమకారుడిని, 20 ఏళ్ల పాటు తనతో పాటు నడిచిన వ్యక్తిని కుట్ర చేసి పార్టీ నుంచి వెళ్లగొట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ అక్రమంగా సంపాదించిన రూ.వేల కోట్లను హుజూరాబాద్‌లో కుమ్మరించారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా చివరికి ప్రజలు తనకే ఓటేశారని అన్నారు.
తన ముఖం మళ్లీ అసెంబ్లీలో కనిపించకుండా చేసేందుకు కుట్రలు పన్నారని, పదుల సంఖ్యలో మంత్రులను రంగంలోకి దించి హడావుడి చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు బీజేపీకే ఓటు వేసి తనకు ఘన విజయం సాధించిపెట్టారని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు, కేసీఆర్ అహంకారాన్ని ఓడించిన సమయంలో ఆయన నైతిక బాధ్యత తీసుకుని సీఎం పదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని భావించానని అన్నారు. కానీ కేసీఆర్ పదే పదే నియంతృత్వ ధోరణిని తనకు తానే బయట పెట్టుకుంటూ ప్రవర్తిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రద్దు చేసి మరోసారి అవమానించారని ఆవేదన చెందారు. అసెంబ్లీలో తన గళం వినిపించవద్దన్న లక్ష్యంతోనే బీజేపీ ఎమ్మెల్యేలమైన తమను ఉద్దేశపూర్వకంగానే బయటికి గెంటేశారని అన్నారు.
ఛలో ఇందిరా పార్క్..
— Eatala Rajender (@Eatala_Rajender) March 17, 2022
రాజ్యాంగ పరిరక్షణ దీక్ష..@BJP4Telangana pic.twitter.com/vH9nGl6Z2w