Heavy Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం, ఈ జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక!
హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల సహా కొన్ని జిల్లాల్లో వర్షం పడనుంది.
హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో సోమవారం సాయంత్రం (జూలై 31) భారీ వర్షం పడుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం డ్యూటీ అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్ష సూచన ఉందని తెలిపారు.
వాతావరణ విభాగం అంచనాల మేరకే నేడు సాయంత్రం 4.15 గంటల నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షం మొదలైంది. గాలులతో పాటు భారీ వర్షంతో కురుస్తోంది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ కుండపోత కురుస్తోంది. ఇప్పటికే రోడ్లన్నీ చాలా వరకూ నీళ్లతో నిండిపోయాయి. అసలే ఆఫీసులు ముగుస్తున్న సమయం కావడంతో నేడు కూడా వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం బాగా ఉండడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఇప్పటికే అలర్ట్ అయి నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు.