GHMC News: రాబోయే వర్షాకాలాన్ని ఎదుర్కోడానికి బల్దియా సిద్ధంగా ఉందా? మంత్రి కేటీఆర్ సమీక్ష
వర్షాకాలం ప్రారంభం నాటికి పనులు పూర్తికావాలి- కేటీఆర్వర్షకాలంలో నీళ్లు నిలిచే పాయింట్లు గుర్తించడమే కీలకం- కేటీఆర్
వానాకాలం వస్తోందంటే చాలు సగటు హైదరాబాదీ హడలెత్తిపోతాడు! వాన దొంగదెబ్బ తీసిపోతుంది! రాత్రికి రాత్రే బస్తీలు జలమయం అయిపోతాయి! నాలాలు ఉప్పొంగుతాయి! మ్యాన్ హోల్ నోరు తెరుచుకుని కాచుక్కూర్చుంటుంది! రోజురోజుకూ పెరిగిపోతున్న పట్టణీకరణ, దశాబ్దాలుగా జరిగిన ఆక్రమణ, మాయమైన చెరువులు, కుచించుకుపోయిన నాలాలు.. వెరసి హైదరాబాద్ బస్తీలు ఫలక్‌నూమా రైలు డబ్బాలుగా మారాయి! ఇది ఇవాళ్టి ప్రాబ్లం కాదు! గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది అని గోరటి వెంకన్న చెప్పినట్టుగా.. గత కొన్నేళ్ల నుంచి తిష్టవేసిన సమస్య ఇది.
ఎదురయ్యే అన్ని పరిస్ధితులకు సన్నద్దంగా ఉండాలి- కేటీఆర్
2021 వరదలు ఇంకా మన కళ్లముందే ఉన్నాయి! 2022లోనూ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. ఒకచోట సమస్యకు పరిష్కారం దొరికితే, మరోచోట ప్రాబ్లం తలెత్తుతోంది! ఎవరి హయాంలో జరిగిన తప్పులు అనే విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడేం చేయాలనే విషయంపై సర్కారు దృష్టి సారించింది. రానున్న వర్షకాలంలో నగరంలో ఎదురయ్యే అన్ని పరిస్ధితులకు సన్నద్దంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు బల్దియా అధికారులను అదేశించారు. నగర ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి సుదీర్ఘంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాల ప్రణాళికతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరద నివారణ కార్యక్రమం, SNDP గురించి మంత్రి కేటీఆర్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వర్షాకాలం ప్రారంభం నాటికి ఈ పనులు పూర్తికావాలి- కేటీఆర్
వర్షాకాల సన్నద్ధతకు సంబంధించిన అన్ని పనులు జూన్ 1వ తేదీ నాటికి పూర్తి కావాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ దిశగా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేసుకోవాలన్నారు. వర్షాకాలం ప్రారంభం నాటికి ఈ పనులను పూర్తయితే, వరద ముంపు ప్రమాదాన్ని అరికట్టేందుకు వీలు కలుగుతుందని కేటీఆర్ అన్నారు. నాలాల్లో ఉన్న అడ్డంకులు, పూడికతీతను తొలగించాలని మంత్రి అదేశించారు. ఇప్పటికే నాలా అడ్డంకులను తొలగించేందుకు SNDP కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం నిధులను సైతం కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమం పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న కేటీఆర్, ప్రస్తుతం SNDP కార్యక్రమంలో భాగంగా నడుస్తున్న నాలాల బలోపేతం కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాలన్నారు. వర్షాల రాకకన్న ముందే ఈ వేసవి కాలంలో ఈ పనులను వేగంగా పూర్తి చేసుకుంటే, లోతట్టు కాలనీలలో వరద ప్రమాదాన్ని అరికట్టెందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా SNDP కార్యక్రమంలో దాదాపుగా పూర్తయిన ప్రధానమైన నాలాల నిర్మాణం, వాటిని బలోపేతం చేసే పనులపై చర్చించారు.
వర్షకాలంలో నీళ్లు నిలిచే పాయింట్లు గుర్తించడమే కీలకం- కేటీఆర్
ఈ కార్యక్రమంలో SNDPతో పాటు GHMC వర్షాకాల ప్రణాళిక అంశాన్ని కూడా మంత్రి కేటీఆర్ విస్తృతంగా సమీక్షించారు. వర్షకాలంలో కీలకమైన నీళ్లు నిలిచే పాయింట్లు, రోడ్ల నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించిన నీళ్లు నిలిచే ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు శాశ్వత ప్రాతిపాదికన పనులు నిర్వహించాలన్నారు. వాటర్ వర్క్స్ పరిధిలోని వాటర్ సీవేజీ, స్ట్రామ్ వాటర్ డ్రయినేజీలు, మ్యాన్ హోళ్ల నిర్వహణపైనా శ్రద్ద వహించాలన్నారు. వర్షకాల సన్నద్దత పనుల కోసం ఇప్పటి నుంచే GHMC విపత్తు నిర్వహణ విభాగంతో ఇతర విభాగాలు కలసి సమన్వయంతో ఒక ప్రణాళిక తయారు చేయాలన్నారు. నగరంలో పలు చోట్ల ప్రమాదం సంభవించేందుకు ఏమాత్రం అవకాశం ఉన్న పాత భవనాల గుర్తింపు అత్యంత కీలకమని, ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపాలని బల్దియాకి సూచించారు మంత్రి కేటీఆర్.
ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జిహెచ్ఎంసి పరిధిలోని ఎమ్మెల్యేలు, నగర మేయర్, కమిషనర్ ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.