(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad News: పాతబస్తీలో ఫైర్ యాక్సిడెంట్- ఇద్దరు చిన్నారులు సహా నలుగురికి గాయాలు
Telangana Crime News: హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fire Accident In Hyderabad : హైదరాబాద్‌లోని కూల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. వెంకటేశ్వ నగర్‌లో ఉన్న ఓ నాలుగు అంతస్థుల బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ బిల్డింగ్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గోదాంలో మంటలు చెలరేగాయి. ఇది మొత్తం బిల్డింగ్‌కు వ్యాపించింది.
సోఫా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్రమంగా మొదటి అంతస్తుకు వ్యాపించాయి. ఆ మంటలు చూసిన స్థానికులు భయోందళనకు గురయ్యారు. ఆ మంటల్లో దాదాపు 20 మంది చిక్కుకున్నారు. కొందరు ధైర్యం చేసి ఆ బిల్డింగ్‌లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు.
గోదాంలో పని చేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఫ్యామిలీ ఆ పక్క ఇంట్లోనే ఉంటున్నారు. ఈ మంటల్లో చిక్కుకున్న శ్రీనివాస్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కూడా గాయపడ్డారు. శ్రీనివాస్, భార్య, ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లో కూడా సోఫా తయారీ మెటీరియల్ పెట్టనట్టు తెలుస్తోంది. అందుకే ఆ రూమ్‌లో కూడా మంటలు చెలరేగినట్టు చెబుతున్నారు. అందుకే మంటలు వ్యాపించినప్పుడు వాళ్లెవరూ బయటకు రాలేకపోయి ప్రమాదంలో ఇరుక్కున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలు ఆర్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.