Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Harish Rao : గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలి.
Harish Rao Fires On Congress : తెలంగాణ సర్కార్ పై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తించాలన్నారు. తమ భవిష్యత్తును నమ్మి ఓటేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరని మోసం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా యువతకు ఓ సూచన చేశారు. ఈ దసరాకు అలాయ్ బలాయ్‌తో పాటుగా కాంగ్రెస్ చేసిన మోసాల గురించి ఒకరితో ఒకరు చర్చించుకోవాలన్నారు.
'గతేడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటూ గ్రామాల్లో ప్రచారం చేసిన యువత.. మీరు ఒక్కసారి ఆలోచించాలి. గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, మీ ఊర్లలో అవ్వా తాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ కూడా పూర్తి చేయలేదు, రైతు బంధును ఆపేశారు. రైతు భరోసా దిక్కులేకుండా పోయింది, వడ్లకు ఇస్తామన్న బోనస్‌ను బోగస్ చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు, పది నెలలు గడిచాయి. అయినా ఇప్పటికీ అతీ గతి లేదు. నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారు. ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో మీరు అలాయ్ - బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చలు జరపండి. మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌లపై నిలదీయాలని పిలుపునిస్తున్నాను.' అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలి.
— Harish Rao Thanneeru (@BRSHarish) October 6, 2024
గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధును…
రుణమాఫీపై చర్చకు సిద్ధమా
తాము అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చెప్పారు. రుణమాఫీ అందని రైతులకు ఏ కారణాల వల్ల అందలేదో వివరాలు తెప్పించమని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయాన్ని జగ్గారెడ్డి చెప్పారు. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమా? అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై రైతులతో చర్చలు జరుపుతామని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చకు రావాలన్నారు. కేసీఆర్ వస్తే.. సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి చర్చకు తాను తీసుకువస్తానంటూ సవాల్ చేశారు జగ్గారెడ్డి. కేసీఆర్‌ను ఒప్పించి తీసుకువచ్చే కెపాసిటీ హరీష్‌కు ఉందా? అని ప్రశ్నించారు. సిద్దిపేటలోనే చర్చ పెట్టుదామని జగ్గారెడ్డి అన్నారు.
మంచి రోజులొస్తాయ్
కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ హయాంలో పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగ చేశారంటూ మండిపడ్డారు. పొలం ఉన్న రైతులను పొట్టన బెట్టుకుంటున్నారని.. కౌలు తీసుకున్న రైతులను కబళిస్తున్నారని విమర్శించారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలి కావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. 'ఓవైపు సాగునీటి సంక్షోభం.. మరోవైపు రుణమాఫీ ద్రోహం. ఇంకోవైపు రైతు భరోసా మోసం. కౌలు రైతులకూ అందని సాయం. రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడంతోనే వ్యవసాయంలో ఈ విలయం. వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా చలనం లేదు. ముఖ్యమంత్రికి సోయి లేదు.. ప్రభుత్వానికి బాధ్యత లేదు. దసరా పండుగ వేళ.. వ్యవసాయాన్ని దండుగలా మార్చిన.. సీఎం రేవంత్‌కు రైతన్నల చేతిలో దండన తప్పదు. అన్నదాతలారా ఆత్మస్థైర్యం కోల్పోకండి..! ముంచే రోజులు పోతాయ్.. మళ్లీ మంచిరోజులొస్తాయ్.' అంటూ కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.