Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారుల సోదాలు, తెరపైకి మరోపేరు!
Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారుల వరుస సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ కు చెందిన స్థిరాస్తి వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావు, శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కాంలో ముడుపుల వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈడీ అధికారులు హైదరాబాద్ లో వరుసగా సోదాలు నిర్వహించడమే కాకుండా ప్రముఖ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును రెండు రోజులుగా తమ కార్యాలయానికి పిలిపించి దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. దిల్లీ మద్యం సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈరోజు కూడా వెన్నమనేని శ్రీనివాస రావు, పెన్నాక శరత్ చంద్రారెడ్డి సహా మరికొంత మందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెండ్రోజులుగా దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రేపు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి.
వెన్నమనేని సోమవారం ఏడు గంటలు పాటు ప్రశ్నించగా... ఆయన ఈరోజు కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. రెండు రోజుల క్రితం ఉప్పల్, మాదాపూర్ లోని రెండు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు వివిధ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. యజమానులకు సంబంధించిన వివరాలు సేకరించారు. దిల్లీలోని మద్యం కుంభకోణంతో ఈ సాఫ్ట్ వేర్ కంపెనీలకు సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల్లో లావాదేవీలు లేకున్నా కోట్లలో లాభాలు వస్తున్నట్లు చూపించిన యజమానులు.. డబ్బును హవాలా మార్గంలో ఇతర పనులకు ఉపయోగించినట్లు గుర్తించారు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి హవాలా మార్గంలో డబ్బులు దిల్లీకి తరలించినట్లు అనుమానిస్తున్నారు. కరీంనగర్ కు చెందిన శ్రీనివాసరావును ఇసుక, మైనింగ్, స్థిరాస్తి వ్యాపారంతో పాటు పలు కంపెనీల్లోనూ డైరెక్ట్ గా ఉన్నట్లు గుర్తించారు. నిన్న శ్రీనివాసరావు చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. అవసరమైతే దిల్లీకి రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు శ్రీనివాస రావుకు తెలిపారు. ఈడీ అధికారులు సెల్ ఫోన్ ను రామాంతపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించి విశ్లేషించే పనిలో ఉన్నారు.
ఐదు రోజుల క్రితం దేశ వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు..
ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 40 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నెల్లూరులో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు సార్లు తనిఖీలు నిర్వహించారు. తాజాగా హైదరాబాద్ లో నానక్‌రామ్ గూడ, కోకాపేట, రాయదుర్గం, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
రాబిన్ డిస్టలరీస్ , రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీలపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీలో రామచంద్ర పిళ్లై, గండ్ర ప్రేమ్ సాగర్ రావు, బోయినపల్లి అవినాష్ రావు, సూదిని సృజన్ రెడ్డిలు భాగస్వామిగా ఉన్నారు. ఈ దాడులతో ఢిల్లీ లిక్కర్ స్కాం తెర వెనక ఎవరున్నారని వివరాలు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితుడైన అవినాష్ రావు పై ఆరోపణలు రావడం ఇటీవల చర్చనీయాంశమైంది. గండ్ర ప్రేమ్ సాగర్ రావు ఇటీవల కాలంలో విదేశాల నుంచి వ్యాపారం మొదలు పెట్టారు. అతనికి ఆర్ధిక సహాయం చేసింది ఎవరు. ఆ లాభాల నుంచి లబ్దిపొందింది ఎవరనేది తేల్చే పనిలో ఈడీ బిజీగా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు రావడంతో.. ఆమెకు సంబంధించిన ఆస్తులపై సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.