పొంచి ఉన్న వైరస్ ముప్పు-తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు కేంద్రం లేఖ
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సహా కొత్తగా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ జాబితాలో తెలంగాణ పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు తమిళనాడు, కేరళ, గుజరాత్ ఉన్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం లేఖలు రాశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీ వరకు 132 కేసులు నమోదు కాగా, మార్చి 15వ తేదీ నాటికి వాటి సంఖ్య 267కి పెరిగినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ నెల రెండో వారంలో పాజిటివిటీ రేటు 0.31 శాతానికి చేరిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఈ నెల 8 నుంచి 15వ తేదీ మధ్యలో దేశవ్యాప్తంగా 2,082 నుంచి 3,254కి కేసులు పెరిగాయని తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను కూడా కేంద్రం ఇదే విధంగా అప్రమత్తం చేసింది.
ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలి
వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించిన రాజేష్ భూషణ్.. అకస్మాత్తుగా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో దృష్టిసారించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ విధానాన్ని కచ్చితంగా అమలుచేయాలని స్పష్టంచేశౄరు. ఇన్‌ప్లుయెంజా, తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై దృష్టి సారించి, పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. వైరస్‌ను ప్రాథమిక స్థాయిలోనే అదుపు చేసేందుకు ప్రత్యేక నిఘా ఉంచాలని.. అంతర్జాతీయ ప్రయాణికులు, గుర్తించిన ఆస్పత్రులు, స్థానిక క్లస్టర్లలో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాలను జన్యు విశ్లేషణకు పంపాలని ఆదేశించారు. అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు
తెలంగాణలో గురువారం ఒక్కరోజే కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 12 కేసులు నమోదు కాగా, సంగారెడ్డి జిల్లాలో రెండు, మిగిలిన 13 కేసులు 13 జిల్లాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 281 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నెల 10 నుంచి 16వ తేదీ మధ్య హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. గత ఏడాది నవంబరు 12వ తేదీన దేశవ్యాప్తంగా 734 కేసులు నమోదుకాగా.. నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ గురువారం కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 700 దాటింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై... ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను హెచ్చరించింది.
కొత్త వేరియంట్‌తో గుబులు
దేశంలో తొలి కరోనా కేసు గుర్తించి మూడేళ్లు దాటింది. మహమ్మారి తగ్గుముఖం పట్టి సాధారణ వాతావరణం నెలకొందని భావిస్తున్న తరుణంలో కొత్త వేరియంట్ తో పాటు ఇన్‌ఫ్లూయెంజా కేసులు దడ పుట్టిస్తున్నాయి. భారత్‌లో తాజాగా కరోనా కొత్త వేరియంట్ XBB 1.16 వెలుగుచూడటం కలవరపాటుకు గురి చేస్తోంది.అత్యంత వేగంగా వ్యాపించే ఈ ఎక్స్‌బీబీ రకం వేరియంట్‍ను ఇప్పటికే చాలా దేశాల్లో గుర్తించారు. అయితే రాబోయే రోజుల్లో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.