రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం, అందుకు పవన్ కళ్యాణ్ తగినవాడు: చిరంజీవి
రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని, ఓ దశలో మనకు రాజకీయాలు అవసరమా అని తాను ఆలోచించానని, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తగినవాడని తెలిపారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని, ఓ దశలో మనకు రాజకీయాలు అవసరమా అని తాను ఆలోచించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని వైఎన్‌ఎం కళాశాలలో ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి. విశ్వేశ్వరయ్య భవన్ లో నరసాపురంలో తాను కలిసి చదువుకున్న పాత మిత్రులతో కలిసి చిరంజీవి సందడి చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే మాట అనడమే కాదు మాట పడటం కూడా ఉంటుంది.
అందుకు పవన్ తగినవాడన్న చిరంజీవి
రాజకీయాల్లో కొనసాగాలంటే చాలా మొరటుగా, కటువుగా ఉండాలని సున్నితంగా ఉండకూడదన్నారు. దాంతో ఇవన్నీ తనకు అవసరమా అని భావించానని, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తగినవాడని.. తాను ఓ మాట అంటాడు, అనిపించుకుంటాడన్నారు. పవన్ ఏదో రోజు ఉన్నత స్థానంలో ఉంటాడని, అందుకు మీ ఆశీస్సులు కావాలి అన్నారు. తాను జీవితంలో అనుకున్నవి అన్నీ చేశానని, పట్టుబట్టి సాధించుకునేవాడన్నారు. కానీ ఒక్కదాంట్లో మాత్రం అంతుచూడలేకపోయానంటూ రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని ప్రస్తావించారు. ఏది ఏమైతేనేం రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి వచ్చానని, తమ్ముడు పవన్ పాలిటిక్స్‌లో రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
. @KChiruTweets about @PawanKalyan 🤩❤️#Chiranjeevi #PawanKalyan pic.twitter.com/77Nqpth5EB
— Asif (@DargaAsif) November 20, 2022
ఇలాంటి కార్యక్రమానికి తొలిసారి హాజరయ్యాను. మిత్రులు ఆహ్వానించినప్పుడు వీలుకాదేమో అనుకున్నాను. అయితే గతంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలు, గెట్ టుగెదర్ ఈవెంట్ల గురించి తెలుసుకున్నాక తనకు రావాలని ఆసక్తి కలిగి కార్యక్రమానికి వచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు. ప్రస్తుతం తన సినిమా వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ జరుగుతుందన్నారు. కాలేజీ పూర్వ విద్యార్థులు కలిసి వారు సాధించిన విజయాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించుకోవడం మంచి ప్రక్రియ అన్నారు. చదువు పూర్తయ్యాక విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో రంగంలో తమ వంతు అడుగు వేసి విజయాలు సాధిస్తారు. నాకు మాత్రం కాలేజీ రోజుల్లోనే నటుడు కావాలని అనిపించిందని, సినిమాల్లోకి రావాలని పునాది పడిందన్నారు. ఓ నాటకంలో ఉత్తమ నటుడిగా తనకు పేరు వచ్చిందని పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
డ్యాన్స్ విషయంలో గురువులు ఎవరూ లేరు..
ఎర్రమిల్లి నారాయణమూర్తి (వైఎన్ఎం) కాలేజీలో చదివే రోజుల్లోనే క్రమశిక్షణ అలవర్చుకున్నానని చెప్పిన చిరంజీవి.. ఎన్‌సీపీలో సీనియర్ కెప్టెన్ స్థాయి వరకు వెళ్లినట్లు చెప్పారు. 1976లో రిపబ్లిక్ డే సందర్బంగా ఆంధ్రప్రదేశ్ తరఫున రాజ్ పథ్‌లో మార్చించ్ చేశానని గుర్తుచేసుకున్నారు. తనను బెస్ట్ డ్యాన్సర్ అని అంటారని, కానీ డ్యాన్స్ విషయంలో గురువులు ఎవరూ లేరని తెలిపారు. అవసరానికి తగ్గట్లుగా మార్చుకుంటే అన్నీ సాధించడం సాధ్యమన్నారు. ఓ విషయంపై ఫోకస్ చేస్తే దాని అంతుచూడటం తన లక్షణమని, కానీ రాజకీయాల విషయంలో మాత్రం అలా జరగలేదన్నారు. పాలిటిక్స్ లో రాణించాలంటే మొరటుగా ఉండాలని, సున్నిత మనస్తత్వం ఉంటే అక్కడ కొనసాగలేమన్నారు. తనకు ఎంతగానో నచ్చిన సినిమా రంగానికి మళ్లీ తిరిగి రావడానికి అదే కారణమన్నారు చిరంజీవి.