Hyderabad Old City: నిఘా నీడలో చార్మినార్.. ప్రపంచ అందగత్తెలు ఓల్డ్ సిటీ వాక్ లో ఏమేం చూడబోతున్నారంటే..?
ఓల్డ్ సీటీ హెరిటేజ్ వాక్ కు ప్రపంచ సుందరీమణులు సిద్దమైయ్యారు. చార్మినార్ నుండి చౌమహల్లా ప్యాలెస్ వరకూ అందగత్తెలు ఏం చూడబోతున్నారు. ఏం చేయబోతున్నారు..?

హైదరాబాద్: నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం పోటీలకు మాత్రమే సుందరీమణులు పరిమితం కాకుండా , తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ప్రాంతాలు, చారిత్రాత్మక కట్టడాల వద్దకు వారిని తీసుకెళ్లడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ ప్రపంచ దేశాలలో మరింత పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. దీనిలో భాగంగా మంగళవారం చార్మినార్ వీధుల్లో హెరిటేజ్ వాక్ కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కట్టదిట్టమైన భద్రత మధ్య హెరిటేజ్ వాక్ జరిగేలా ప్లాన్ చేసారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా నీడలో చార్మినార్ పరిసర ప్రాంతాలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఓల్డ్ సిటీలో అందగత్తెల హెరిటేజ్ వాక్ ఎలా జరగనుందంటే..
ఈరోజు రాత్రి హెరిటేజ్ వాక్
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనడానికి హైదరాబాద్ నగరానికి వచ్చిన 109 దేశాల కంటెస్టంట్లు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మన ఓల్డ్ సిటీ లో చార్మినార్ వద్ద ఈరోజు రాత్రి హెరిటేజ్ వాకింగ్ నిర్వహిస్తారు. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న వేదిక వద్ద నుండి నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకునే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందుగా సుందరిమణులకు పాత బస్తీలో ప్రసిద్ది చెందిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. ఆ తరువాత చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తారు.
. 
అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు వంటి అలంకరణ వస్తువుల షాపింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతిలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కె ఆర్ కాసత్, జాజు పెరల్స్ ఏ హెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో షాపింగ్ నిర్వహిస్తారు. గాజులు తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలిస్తారు.

చార్మినార్ వీధుల్లో హెరిటేజ్ వాక్ తరువాత నేరుగా తెలంగాణలో చార్మిత్మక ,ప్రసిద్ది చెందిన కట్టడం చౌమహల్లా ప్యాలెస్ కు చేరుకుంటారు. ఈ ప్యాలెస్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందుకు హాజరవుతారు. ఇదే ప్యాలెస్ లోనే మిస్ వరల్డ్ సుందరీమణులకు మెహేంది వేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నిజాం రాజుల కాలంనాటి సాంప్రదాయ దుస్తులను నేరుగా చూసేలా ఏర్పాటు చేసారు. అంతేకాదు ఇక్కడే రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే సినిమాలను ప్రదర్శిస్తారు. చౌహన్లా ప్యాలెస్ లో నిజాం రాజుల హయాంలో ఉపయోగించిన యుద్ధ ఆయుధాలు, గృహోపకరణ సామాగ్రి, నిజాం నవాబులు ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు, ఓల్డ్ సిటీ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనలు మిస్ వరల్డ్ కంటెస్టంట్లు తిలకిస్తారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లను చేశారు. ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్ నేపధ్యంలో ఇప్పటికే గాజుల దుకాణాల్లో హ్యాండ్ మేడ్ గాజులను, వినూత్న డిజైన్లు, రంగులలో అందుబాటులో ఉంచారు. గాజులు ఎలా తయారు చేస్తారో చూపించడంతోపాటు , ఓల్డ్ సిటీలో తయారయ్యే ప్రత్యేక ఆభరణాలను ఈ హెరిటేజ్ వాక్ లో అందగత్తెలను ఆకట్టుకోనున్నాయి






















