Chandrababu Pawan Meet: చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్, రాజకీయాలపై చర్చ! కాసేపట్లో ఉమ్మడి ప్రెస్ మీట్?
విశాఖలో పవన్ కళ్యాణ్‌ను అడ్డుకున్న సమయంలో చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను కలిసి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ ఆదివారం (జనవరి 8) మధ్యాహ్నం వెళ్లారు. వీరిద్దరు భవిష్యత్తులో రాజకీయంగా కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే కోణంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికల ఊహాగానాల వేళ రెండు పార్టీల పొత్తును ఇప్పుడే ప్రకటించాలా? లేదంటే కొంతకాలం వేచి ఉండాలా? అనేది మాట్లాడుతుకోనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రతిపక్ష సభలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులు వంటి అంశాలపై మాట్లాడుకోనున్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1పైన కూడా తాజా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
విశాఖలో పవన్ కళ్యాణ్‌ను అడ్డుకున్న సమయంలో చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను కలిసి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఉన్న పవన్ కల్యాణ్ వద్దకు అప్పుడు చంద్రబాబు స్వయంగా వెళ్లి కలిశారు. ఆయన్ను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంపై పరామర్శించారు. మళ్లీ ఇప్పుడు మూడు నెలలు గడవక ముందే పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పర్యవసానాల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సెటైర్లు మొదలు
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అంశంపై అప్పుడే అధికార పార్టీ నేతలు కూడా సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్త తండ్రి వద్దకు దత్త పుత్రుడు వెళ్లారంటూ ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేస్తూ.. పవన్ కల్యాణ్‌ను, చంద్రబాబును ట్విటర్‌లో ట్యాగ్ చేశారు.
సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి@ncbn వద్దకు దత్త పుత్రుడు@PawanKalyan
— Gudivada Amarnath (@gudivadaamar) January 8, 2023
అంబటి రాంబాబు సెటైర్లు
మరో మంత్రి అంబటి రాంబాబు కూడా తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయని.. అలా చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళారని ట్వీట్ చేశారు. డుడు బసవన్నలా తల ఊపడానికి వెళ్లారని ట్వీట్ చేశారు.
సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి చంద్రబాబు ఇంటికి పవన్‌కళ్యాణ్ వెళ్ళాడు డుడు బసవన్నలా తల ఊపడానికి ! @ncbn @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) January 8, 2023
11 మంది చనిపోతే పవన్ ఎందుకు పరామర్శించలేదు - ఎంపీ మార్గాని భరత్
టీడీపీ రోడ్ షోలలో రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది చనిపోతే పవన్ కల్యాణ్ పరామర్శించేందుకు వెళ్లలేదని, అలాంటిది రాజకీయాల కోసం పవన్ చంద్రబాబును కలిసేందుకు వెళ్లారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. వారి మధ్య ఉన్న ఒప్పందాలు రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. పవన్ కల్యాణ్ కొన్ని రోజులు ఇంట్లో ఉండి అప్పుడప్పుడూ రాజకీయాల్లో కనిపిస్తుంటారని ఎద్దేవా చేశారు. అధికారం పోగానే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారని, ఖాళీ సమయాల్లో పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారని భరత్ అన్నారు. వారిద్దరూ హైదరాబాద్ లో కలవడమే.. ఏపీ రాజకీయాల పట్ల వారికి శ్రద్ధ లేదని తెలుస్తోందని మాట్లాడారు.