BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత
పరువు హత్యకు గురైన మార్వాడీ యువకుడు నీరజ్ పన్వార్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం (Postmortem Completed for Neeraj Panwar) పూర్తయ్యింది.
Begum Bazar Honor Killing: హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో శుక్రవారం రాత్రి పరువు హత్యకు గురైన మార్వాడీ యువకుడు నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం (Postmortem Completed for Neeraj Panwar) పూర్తయ్యింది. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసిన తరువాత పోలీసులు, అధికారులు కొన్ని సూచనలతో నీరజ్ పన్వార్ డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. నీరజ్ శరీ తల, మెడ, గొంతు ఎడమవైపు, ఛాతీ భాగాల్లో 10కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉంది. బండ రాయితో సైతం కొట్టి దాడి చేసినట్లు పోస్టుమార్టం ద్వారా గుర్తించారు. కత్తితో దాడి చేయడంతో తల వెనుక భాగంలో మెదడు భాగం తెగిపడింది. నీరజ్‌ను హత్య చేసింది వేరే వాళ్లు అని, తమకు చూపిస్తున్న వ్యక్తులు వేరు అని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
నీరజ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తరలిస్తున్నారు. నేటి రాత్రిలోపు అంత్యక్రియలు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే నీరజ్ పన్వార్‌ను హత్య చేసిన వారిని కాకుండా వేరే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అతడి ఫ్యామిలీ ఆరోపిస్తోంది. మరోవైపు శనివారం ఉదయం నుంచి షాహినాథ్‌గంజ్ పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
పరువు హత్య కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నీరజ్ పన్వార్ భార్య సంజన సోదరుడు కూడా ఉన్నాడు. కర్ణాటకలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రోహిత్, రంజిత్, కౌశిక్ , విజయ్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే.. ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్న నాగరాజు పరువు హత్య మరవకముందే నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ బేగం బజార్ లోని మచ్చి మార్కెట్ వద్ద నీరజ్ పన్వార్ అనే ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కత్తులు, రాళ్లతో దాడికి పాల్పడి వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం.. బేగం బజార్ షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీరజ్ పన్వార్ అనే యువకుడు బైకుపై వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు అతడ్ని అడ్డుకున్నారు. బైక్ ఆపిన వెంటనే తమ వెంట తెచ్చుకున్న కత్తులతో నీరజ్ పన్వార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. కొందరు రాళ్లతో కూడా యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దాదాపు 20 సార్లు కత్తితో పొడవడంతో నీరజ్ పన్వార్ కుప్పుకూలిపోయి అక్కడే మరణించాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో పగ పెంచుకున్న యువతి బంధువులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏడాది కిందట నీరజ్ పన్వార్ ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.