(Source: ECI/ABP News/ABP Majha)
Union Minister Kishan Reddy : తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులిచ్చింది, లెక్కల చిట్టా విప్పిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Union Minister Kishan Reddy : తెలంగాణకు కేంద్రం వివిధ పథకాల ద్వారా వేల కోట్ల నిధులు ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీచేశారు.
Union Minister Kishan Reddy : బీఆర్ఎస్ , బీజేపీ మధ్య లెక్కల వార్ నడుస్తోంది. కేంద్రం ఏం ఇచ్చిందంటూ తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తుంటే లెక్కలతో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కేంద్రం ఇచ్చిన నిధుల చిట్టా విప్పారు. తెలంగాణలో పట్టణాల పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ లో భాగంగా వరంగల్, కరీంనగర్ కు రూ. 392 కోట్ల నిధులు విడుదల చేశామని తెలిపారు. అమృత్ పథకంలో తెలంగాణ నుంచి ఎంపికైన 12 పట్టణాలకు రూ. 833.36 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. అమృత్ పథకంలో భాగంగా తెలంగాణకు చెందిన 143 పట్టణాలలో రూ.2780 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకంలో రాష్ట్రానికి 2,49,465 ఇళ్లు మంజూరు చేశామని, వీటి నిర్మాణానికి ఇప్పటికే రూ. 3128.14 కోట్లు విడుదల చేశామని కేంద్రమంత్రి వెల్లడించారు.
పట్టణీకరణకు అనుగుణంగా రాష్ట్రంలోని పట్టణాలలో సౌకర్యాల మెరుగుదలపై ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి దృష్టి సారించకున్నా, @narendramodi గారి ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాలలో సౌకర్యాల మెరుగుదలకు పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తోంది. pic.twitter.com/oKaQuItkfD
— G Kishan Reddy (@kishanreddybjp) January 8, 2023
వరంగల్, కరీంనగర్ కు రూ.1000 కోట్లు
దేశంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో స్మార్ట్ సిటీస్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్, అర్బర్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకాలను ప్రారంభించిందని కిషన్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా 100 నగరాలను ఎంపిక చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా వరంగల్, కరీంనగర్ పట్టణాలను ఎంపిక చేశామన్నారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమం కింద వరంగల్ కు రూ. 500 కోట్లు, కరీంనగర్ కు రూ. 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని స్పష్టంచేశారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద 50:50 లో కేంద్ర, రాష్ట్రాలు నిధులను కేటాయిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తదుపరి విడత నిధులను విడుదల చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వం తన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు.
తెలంగాణకు 2,49,465 ఇళ్లు మంజూరు
అమృత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 500 పట్టణాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. పట్టణాలలో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అమృత్ పథకంలో భాగంగా పట్టణాలలో సంస్కరణల అమలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పట్టణ రవాణా, ఉద్యానవనాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ పథకంలో తెలంగాణ నుంచి ఎంపికైన 12 పట్టణాలకు రూ. 833.36 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద కేంద్రం తెలంగాణకు రూ. 4465.81 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు రూ. 3128.14 కోట్లను విడుదల చేసిందని వెల్లడించారు. ఈ పథకం కింద తెలంగాణకు 2,49,465 ఇళ్లను మంజూరు చేయగా, 2,39,422 ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయని తెలిపారు. వీటిల్లో 2,15,443 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు స్పష్టం చేశారు.