Revanth Reddy : తెలంగాణలో బెంగాల్ తరహా పాలిటిక్స్, పోల్ పోలరైజేషన్ కోసం బీజేపీ-టీఆర్ఎస్ డ్రామాలు- రేవంత్ రెడ్డి
Revanth Reddy : బెంగాల్ తరహా రాజకీయాలు చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ పోరుబాటపై చర్చించారు. ఈ నెల 21న సీఎస్ ను కలిసి రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పిస్తారమని రేవంత్ రెడ్డి అన్నారు. 24న మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 30న నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 5న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలన్నారు. స్థానికంగా నేతల విగ్రహాల నుంచి కలెక్టరేట్ల వరకు ర్యాలీగా తరలివెళ్లాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొనాలన్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
పోల్ పోలరైజేషన్
మునుగోడు ఎన్నికల్లో, భారత్ జోడో యాత్ర కోసం పార్టీ శ్రేణులు కష్టపడ్డాయని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, టీఆరెస్ కొన్ని వివాదాస్పద అంశాలను చర్చకు పెట్టాయని, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఇరు పార్టీలు నాటకాలాడుతున్నాయన్నారు. నయీమ్ కేసు, డ్రగ్స్ కేసు, ఆర్టీసీ కార్మికుల ధర్నాలను వివాదాస్పదం చేశారని గుర్తుచేశారు. వెస్ట్ బెంగాల్ తరహా పాలిటిక్స్ తెలంగాణలో చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. పోల్ పోలరైజేషన్ కోసం బీజేపీ, టీఆరెస్ డ్రామాలు చేస్తున్నాయన్నారు. దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. రైతు రుణమాఫీ 47 లక్షల మందికి 25 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వారికి ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
పోడు భూములపై పోరాటం
"అసైన్డ్ భూములను సీలింగ్ ల్యాండ్ పేరుతో ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తోంది. పోడు భూముల సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ధాన్యం కొనుగోలు సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉంది. సీఎస్ కు ఈ సమస్యలపై రిప్రజెంటేషన్ ఇవ్వడంతో కార్యాచరణ ప్రారంభిద్దాం. అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ఇందిరాపార్క్ వద్ద రెండు రోజుల దీక్ష కార్యక్రమం చేపట్టాలి. సోమవారం నుంచి డిసెంబర్ 5 లోపు ఈ కార్యక్రమాలు చేపట్టాలి. వీటిపై మీ సలహాలు, సూచనలు ఇవ్వండి."- అని పార్టీ శ్రేణులను రేవంత్ రెడ్డి కోరారు.
సీఎస్, గవర్నర్ కు వినతి పత్రాలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకం కింద 47 లక్షల మందికి రూ.25 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇందులో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దశల వారీగా పోరాటాలు చాలా అవసరమని, వ్యవసాయం, రైతుల అంశాలు ఇప్పుడు చాలా కీలకమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. ముందు నియోజకవర్గాల్లో పోరాటాలు చేసి రైతులు, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలు, డిమాండ్లను సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేసిన తర్వాత గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని ఎంపీ ఉత్తమ్ నిర్ణయించారు. ఈ పోరాటాలను చాలా కీలకంగా భావించి పని చేద్దామని పార్టీ నేతలు, శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.