Revanth Reddy Letter : ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయండి, సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
Revanth Reddy Letter : ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఏడు ప్రశ్నలను తొలగించాలన్న హైకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు.
Revanth Reddy Letter : సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలిందని ఆరోపించారు. పోలీసు విభాగంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఆగస్టులో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారని, కొలువులు వస్తాయని ఆశించిన యువతకు ఈ పరీక్ష తీవ్ర ఆవేదనను మిగిల్చిందన్నారు. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ విధానంలో కొలువుల భర్తీలో బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో తెలుస్తోందన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ రెండు ప్రశ్నపత్రాల్లో చెరో 7 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సంబంధించి అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందన్నారు. ఈ 7 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయని అభ్యర్థులు అంటున్నారన్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించి కొందరికి మార్కులిచ్చారని ఆరోపించారు. అసలు సమాధానం ఇవ్వని వారికి సైతం మార్కులు కేటాయించారన్నారు. కానీ కొందరు అభ్యర్థులకు మాత్రం మార్కులు ఇవ్వలేదని తెలిపారు.
హైకోర్టు ఆదేశాలు అమలు చేయండి
ఈ విషయాన్ని అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అయినా ఎటువంటి స్పందన లేకుండానే మెరిట్ జాబితాను రూపొందించి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారన్నారు. దీనిపై హైకోర్టు డిసెంబర్ 9న తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. అభ్యర్థులు పేర్కొన్న 7 ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. ఆ మేరకు అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశమివ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తే దాదాపు 50-60 వేల మంది అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులకు హాజరయ్యే అవకాశం లభిస్తుందన్నారు. అభ్యర్థులు తమ ఆవేదనను ట్విట్టర్ లో కేటీఆర్, డీజీపీలకు విన్నవించుకున్నా సమాధానం రాలేదని ఆరోపించారు. సంబంధిత శాఖను చూసే హోం మంత్రి ఉన్నారా లేరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇవేమీ పట్టన్నట్లు బీఆర్ఎస్ అంటూ దేశమంతా తిరుగుతుంటారని మండిపడ్డారు. పాలన ఈ విధంగా ఉంటే ఉద్యోగార్థుల సమస్యను తీర్చెదెవరు? అని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశించిన ప్రిలిమినరీ పరీక్షలోని 7 ప్రశ్నలను తొలగించి అభ్యర్థులకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అభ్యర్థుల్లో గందరగోళం
తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో పలు ప్రశ్నల విషయంలో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. మొత్తం 13 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థుల నుంచి టీఎస్ఎల్‌పీఆర్బీ ఫిర్యాదులు కూడా ఆహ్వానించింది. ఈ తప్పుల విషయంపై హైకోర్టులో పలువురు పిటిషన్ వేశారు. దీనిని విచారించిన ధర్మాసనం అభ్యర్థులు పేర్కొన్న 7 ప్రశ్నలు తొలగించాలని ఆదేశించింది. ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో పలు తప్పులు దొర్లాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్పందించిన అధికారులు మొత్తం 8 మార్కులు కలిపారు. అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌లు డిసెంబర్ 8 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్స్ నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 సెంటర్లను రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుచేసింది. ఈ మొత్తం ప్రక్రియను 25 రోజుల్లో పూర్తి చేయనున్నారు.