Hyderabad Rapido Boy Tweet to CM Revanth: ఒక్క ట్వీట్ .. రెండు హృదయాలు- రాపిడో బాయ్ ఆకలి తీర్చిన ఇందిరమ్మ క్యాంటీన్ .. సీఎం రేవంత్ ఎమోషనల్ రిప్లై!
Indiramma Canteen: ఓ ర్యాపిడో డెలివరీ బాయ్.. తన ఆకలి తీర్చిన ఇందిరమ్మ క్యాంటీన్ పై ట్వీట్ పెట్టారు. దానికి సీఎం రేవంత్ రిప్లయ్ ఇచ్చారు.

CM Revanth Reddy Emotional Reply to Bike Taxi Driver: హైదరాబాద్ మహానగరంలో నిరంతరం చక్రాల మీద సాగే ఒక శ్రమజీవి ప్రయాణం.. రాష్ట్ర ముఖ్యమంత్రి గుండెలను తాకిన భావోద్వేగ క్షణమిది. నిత్యం ఎండనక, వాననక నగర వీధుల్లో రాపిడో బైక్ నడుపుకుంటూ పొట్టకూటి కోసం శ్రమించే ఒక యువకుడు.. కోటి లోని ఇందిరమ్మ క్యాంటీన్‌కు వెళ్లాడు. జేబులోంచి పది రూపాయల నోటు తీసి కౌంటర్‌లో ఇస్తే, వేడివేడిగా ఆరు ఇడ్లీలు ప్లేట్ లోకి వచ్చాయి. ఆకలితో నకనకలాడుతున్న ఆ కడుపు నిండాక.. ఆ శ్రమజీవి గుండెల్లోంచి ఒక కృతజ్ఞత భావం ట్వీట్ రూపంలో సామాజిక మాధ్యమాల్లో వెలువడింది. నాలాంటి లేబర్ కే గాని, ఆటో డ్రైవర్ల కే గాని, కార్మికుల గాని ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్ గారికి అలానే సీఎం రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు.. ఇట్లు మీ హైదరాబాద్ రాపిడో బాయ్ అంటూ ఆ యువకుడు పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఎప్పుడూ చూడలేదు.. కలవలేదు.. కానీ ఆకలి తీరిన తృప్తి చాలు!
ఎవరో ఒక సామాన్య శ్రమజీవి.. అంతకుముందెన్నడూ ముఖ్యమంత్రిని నేరుగా చూడలేదు, ఎన్నడూ కలవలేదు. కానీ, ఆ యువకుడు పంపిన అభినందన సందేశం నేరుగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని కదిలించింది. ఆ ట్వీట్‌పై సీఎం రేవంత్ రెడ్డి అంతే ఎమోషనల్‌గా స్పందించారు. ఆకలి తీర్చారు అంటూ ఆ యువకుడు చెప్పిన ఒక్క మాట, తెలిపిన అభినందన ఎంతో సంతృప్తినిచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో పుట్టిన ఆలోచనే ఇందిరమ్మ క్యాంటీన్లు . మీ కడుపు నిండిన తృప్తి, మీ ముఖంలో చిరునవ్వు... మీ అన్నగా నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది అంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన రిప్లై సామాన్య ప్రజల హృదయాలను గెలుచుకుంది.
ఎవరో శ్రమజీవి... ఎప్పుడూ చూడలేదు... ఎన్నడూ కలవలేదు...
— Revanth Reddy (@revanth_anumula) July 11, 2026
కానీ, "ఆకలి తీర్చారు" అంటూ ఆ యువకుడు చెప్పిన ఒక్క మాట, తెలిపిన అభినందన ఎంతో సంతృప్తినిచ్చింది.
ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో పుట్టిన ఆలోచనే 'ఇందిరమ్మ క్యాంటీన్లు'.
మీ కడుపు నిండిన తృప్తి, మీ ముఖంలో… https://t.co/hzTlh5avq7
కష్టజీవుల ఆదరణే సీఎం రేవంత్ అన్నకు అసలైన బలం!
నగరంలో ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, డెలివరీ బాయ్స్, సెక్యూరిటీ గార్డులు లాంటి ఎంతోమంది కష్టజీవులు మధ్యాహ్నం వేళ లేదా ఉదయం పూట తక్కువ ధరలో నాణ్యమైన భోజనం దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రూ.10 కే ఇందిరమ్మ క్యాంటీన్ల ను అందుబాటులోకి తెచ్చింది. ఒక రాపిడో బైక్ నడిపే తమ్ముడి ఆకలి తీరినప్పుడు కలిగిన ఆనందం, ఒక ముఖ్యమంత్రికి వందల కోట్ల ప్రజాకర్షక పథకాల కంటే ఎక్కువ తృప్తిని ఇచ్చింది. కష్టజీవుల గుండెల్లోంచి వచ్చే ఇలాంటి ఆదరణే, ప్రజల కోసం మరిన్ని సంక్షేమ అడుగులు ముందుకు వేయడానికి నాకు మరింత స్ఫూర్తిని, బలాన్ని ఇస్తాయి అని రేవంత్ రెడ్డి పేర్కొనడం వారి మధ్య ఉన్న అన్నా-తమ్ముళ్ల బంధాన్ని ప్రతిబింబించింది.
పేదవాడి ఆకలి రాజ్యానికి పొలిటికల్ రంగు లేదు!
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎన్ని ఉన్నప్పటికీ.. ఇలాంటి క్షేత్రస్థాయి మానవీయ కోణాలు ప్రజాస్వామ్యానికి అసలైన అందాన్ని తెస్తాయి. పది రూపాయలకే కడుపు నిండా ఆరు ఇడ్లీలు అందించే ఈ క్యాంటీన్లు.. కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అది నగరంలోని వేలాది మంది కార్మికుల జీవితాలకు ఒక భరోసా. ఒక సామాన్య బైక్ టాక్సీ డ్రైవర్ తన బాధను, తృప్తిని నేరుగా ముఖ్యమంత్రితో పంచుకోవడం.. దానికి రాష్ట్ర పాలకుడు ‘మీ అన్నగా ఉన్నాను’ అంటూ స్పందించడం ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నాయో అర్థమవుతోంది. ఈ ఒక్క సంఘటన ఇందిరమ్మ క్యాంటీన్ల ఆవశ్యకతను నగరంలో మరింత చాటిచెప్పింది.
నెటిజన్ల ఫిదా!
సామాన్యుడి ట్వీట్-సీఎం రేవంత్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రజాప్రతినిధులు అంటే కేవలం కాన్వాయ్‌లు, సభలకే పరిమితం కాకుండా.. ఇలా తమ్ముడిలా భావించి కష్టజీవి గుండె చప్పుడును వినడం అభినందనీయమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాపిడో బాయ్ ముఖంలోని ఆ చిరునవ్వు, సీఎం రేవంత్ రెడ్డికి పాలనలో మరిన్ని విప్లవాత్మక సంక్షేమ పథకాలు తీసుకురావడానికి సరికొత్త స్ఫూర్తిని ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Before You Go
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు





















