KTR: లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి జీనోమ్ వ్యాలీ వెన్నెముకగా నిలుస్తోంది : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 19వ బయో ఆసియా సదస్సును మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన 50 ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు.
దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. 19వ బయో ఆసియా సదస్సును మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. వర్చువల్ గా లైఫ్ సైన్సెస్–ఆరోగ్య రంగంలో కోవిడ్ సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి జీనోమ్ వ్యాలీ వెన్నెముకగా నిలుస్తుందని స్పష్టం చేశారు. బిల్ గేట్స్ తో జరిగే చర్చ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మంత్రి తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో సుమారు 215 సంస్థల నుంచి రూ. 6,400 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. ఇప్పటికే ఉన్నవాటితో పాటు కొత్తగా వచ్చిన సంస్థలతో ఏడాది కాలంలో 34 వేల మందికి ఉపాధి లభించిందన్నారు. గతేడాదితో పోలిస్తే 200 శాతం వృద్ధి సాధించిందని స్పష్టం చేశారు. జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్ ఏ విధంగా ప్రభావం చూపుతోంది.. ఈ వృద్ధినే నిదర్శనమని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రోత్సాహం అందిస్తుందనేది స్పష్టమవుతోందని కేటీఆర్ తెలిపారు.
IT and Industries Minister @KTRTRS shared his thoughts on life sciences ecosystem existing in Telangana at the inaugural Ceremony of state Govt’s annual flagship event #BioAsia2022. pic.twitter.com/VPlmPBYhvO
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 24, 2022
ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్ హెల్త్‌కేర్ ఫోరం బయో ఆసియా సదస్సు-2022 (BioAsia)కు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ సదస్సులో బిల్‌గేట్స్, డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, నీటి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సహా వివిధ సంస్థలకు చెందిన దాదాపు 50 మంది ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు.
ఈ సమావేశంలో మొదటి రోజు గురువారం ఆరోగ్య పరిశ్రమలలో సాంకేతిక, కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్‌ను క్రమబద్ధీకరించడంపై చర్చిస్తారు. ఈ చర్చల్లో మంత్రి కేటీఆర్‌తోపాటు బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-ఛైర్మన్ బిల్‌గేట్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, యూరోపియన్ యూనియన్ ప్రధాన శాస్త్ర సలహాదారు (ఎపిడమిక్స్) డాక్టర్ పీటర్ పియోట్, భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, బయాలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, కేంద్ర బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేశ్ ఎస్ గోఖలే పాల్గొంటున్నారు. శుక్రవారం ఫార్మా, ఆ రంగం అభివృద్ధి అవకాశాలపై చర్చిస్తారు. ఈ చర్చలో బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరిస్, జైడస్ క్యాడిలా, సీరమ్స్ సంస్థలు పాల్గొంటాయి.