(Source: ECI/ABP News/ABP Majha)
Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
Nikhat Zareen : ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన అనంతరం నిఖత్ జరీన్ తొలిసారి హైదరాబాద్ వచ్చారు. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.
Nikhat Zareen : ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్(World Women's Boxing Championship) లో స్వర్ణ పథకం సాధించిన నిఖత్ జరీన్(Nikhat Zareen) తొలిసారి హైదరాబాద్ తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు(Shamshabad Airport)లో ఆమెకు ఘనంగా ఆమెకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, క్రీడాభిమానులు నిఖత్ జరీన్ కు ఘన స్వాగతం పలికారు.
- ఇందూరు బిడ్డకు ఘన స్వాగతం
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు స్వాగతం పలికారు. నిజమాబాద్ ఇందూరు బిడ్డకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. టర్కీ(Turky) రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు. ఫైనల్స్‌లో 52 కేజీల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్ జిటిపాంగ్‌ను 5-0తో చిత్తు చేసి గోల్డ్ మెడల్ అందుకుంది. దీంతో మేరీకోమ్(Marykom), సరితా దేవి, జెన్నీ, లేఖ తర్వాత ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా జరీన్ రికార్డు అందుకున్నారు.
- ఒలింపిక్స్ లో పతకం సాధించాలని ఆకాంక్ష
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి వరల్డ్ ఛాంపియన్ షిప్ లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ క్రీడాకారులకు సపోర్టు చేసేవారు కాదన్నారు. తెలంగాణపై వివక్ష చూపించేవారన్నారు. నిజామాబాద్(Nizamabad) బిడ్డ అయిన నిఖత్ జరీన్ తెలంగాణ(Telangana)కే పేరు తెచ్చారన్నారు. భవిష్యత్ లో ఆమె ఒలింపిక్స్ లో పతకం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆమె మరిన్నీ విజయాలు సాధించాలని కోరారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తల్లిదండ్రుల త్యాగం, రాష్ట్ర ప్రభుత్వం సపోర్టుతో నిఖత్ జరీన్ ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. ఇషా సింగ్ కూడా షూటింగ్ లో పతకాలు సాధించారని, ఆమె కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే అన్నారు. ఆమెకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.