BJP Meeting : చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేశారు, మాజీ మంత్రి చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు
Bjp Telangana Formation Day Meeting : సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మందికి ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఆశచూపి వాడుకున్నారని తెలంగాణ ఉద్యమకారులు ఆరోపించారు. ఒక సమయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారన్నారు.
![BJP Meeting : చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేశారు, మాజీ మంత్రి చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు Hyderabad BJP Telangana formation day meeting kcr trying topple down chandrababu govt BJP Meeting : చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేశారు, మాజీ మంత్రి చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/02/647d660276e6409ea900c5cf15e70e9e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bjp Telangana Formation Day Meeting : హైదరాబాద్ శివారులోని తట్టి అన్నారంలో బీజేపీ ‘అమరుల యాదిలో... తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సభ’ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాట సంగతులను నేతలు గుర్తుచేసుకున్నారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. సీఎం కేసీఆర్ తమకు ద్రోహం చేశారని కొందరు నేతలు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే రఘునందన్ రావుతోపాటు తెలంగాణ ఉద్యమకారులు, మాజీమంత్రులు డాక్టర్ ఏ.చంద్రశేఖర్, డాక్టర్ విజయరామారావు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పలు నేతలు సభలో పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేసీఆర్ కుట్ర : మాజీ మంత్రి చంద్రశేఖర్
కేసీఆర్ కు ఉమ్మడి ఏపీలో సీఎం కావాలని వెంపర్లాడారని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 60 మంది ఎమ్మెల్యేలను చీల్చి ప్రత్యేక హెలికాప్టర్లలో గవర్నర్ ను కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేశారన్నారు. ఈ విషయం చంద్రబాబుకు ముందే తెలియడంతో కేసీఆర్ కుట్రకు అడ్డుకట్టవేశారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనతోపాటు ఎంతోమందికి ముఖ్యమంత్రి, మంత్రి పదవుల ఆశచూపి కేసీఆర్ మోసం చేశారన్నారు. దళితులందరికీ 3 ఎకరాల భూమిని పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ వాటిని పంచేందుకు ఇష్టపడకుండా దళితులకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులైన పేద దళితులందరికీ 3 ఎకరాల భూమిని పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయలేకపోయిన నాడు రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.
కేసీఆర్ వల్ల 12 ఎకరాల భూమి అమ్ముకున్నా : మాజీ ఎంపీ రవీంద్రనాయక్
సీఎం కేసీఆర్ నమ్మి 12 ఎకరాల భూమిని అమ్మేసి డబ్బులిచ్చి మోసపోయానని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ అన్నారు. తనలాంటి ఎందరో నాయకుల రాజకీయ భవిష్యత్తును కేసీఆర్ నాశనం చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవినీతిని ప్రధాని నరేంద్రమోదీ ఎండగట్టారన్నారు. ఇకపై కేసీఆర్ బద్మాష్ పనులతోపాటు ఆయన అవినీతిపై బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించాలన్నారు.
కేసీఆర్ కుటుంబంతో తెలంగాణకు పెను ప్రమాదం : మాజీమంత్రి విజయరామారావు
కళ్లుతాగి ఉళ్లను తాకట్టు పెట్టినోళ్లను ఎంతోమందిని చూసినని, కేసీఆర్ అంతకంటే ఎక్కువని రాష్ట్రాన్ని బేరం పెడుతున్నారని మాజీ మంత్రి విజయరామారావు ఆరోపించారు. కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని హామీనిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంతో తెలంగాణకు పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)