Bandi Sanjay Etela Arrest : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై బీజేపీ ఆందోళన- బండి సంజయ్, ఈటల అరెస్ట్!
Bandi Sanjay Etela Arrest : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై బండి సంజయ్ దీక్షకు దిగారు. అనంతరం టీఎస్పీఎస్సీ ఆఫీస్ కు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో పోలీసులు బండి సంజయ్, ఈటలను అరెస్ట్ చేశారు.
Bandi Sanjay Etela Arrest : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద దీక్షకు దిగారు. దీక్షకు అనుమతి లేదని బీజేపీ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ బండి సంజయ్ దీక్ష కొనసాగించారు. దీక్ష అనంతం బండి సంజయ్ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్తామని ప్రకటించడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. గన్ పార్క్ నుంచి టీఎస్పీఎస్సీ ఆఫీస్ వైపు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు బండి సంజయ్, ఈటల రాజేందర్ ను అరెస్టు చేశారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో కార్ఖానా పీఎస్ కు తరలించారు. పోలీస్ వాహనాన్ని ముందుకు వెళ్లకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
గన్ పార్క్ వద్ద శ్రీ @bandisanjay_bjp అరెస్ట్ దృశ్యాలు pic.twitter.com/iAZNUtYEWG
— BJP Telangana (@BJP4Telangana) March 17, 2023
సిట్టింగ్ జడ్జితో విచారణ
అరెస్ట్ కు ముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. గ్రూప్ 1 ప్రశ్నా పత్రం లీక్ చేసి లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకున్నాడని కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు. పేపర్ లీక్ పై ఇంత జరుగుతున్నా నోరు మెదపని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అని ప్రశ్నించారు. సీఎం.. పేపర్ లీక్ పై తక్షణమే స్పందించి సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డికి బీజేపీ కార్యకర్తలంతా ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎలక్షన్ లో గెలిచేది బీజేపీ ప్రభుత్వమే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అందుకు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచిన ఏవీఎన్ రెడ్డి బీజేపీకీ స్పూర్తి, ఆదర్శం అని బండి అన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని బండి విమర్శించారు. ఈ ప్రభుత్వానికి టీచర్లే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి
బీఆర్ఎస్ పాలనలో నీళ్లు,నిధులు, నియామకాల్లో అక్రమాలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచ్ బిడ్డ కోసం పేపర్ లీకేజీ చేస్తారా అని మండిపడ్డారు. ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించుకున్నామో, అది నెరవేరలేదన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీకి కారణం ఐటీ వైఫల్యమేనని, దీనికి బాధ్యతగా కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేశాుర. కుంటిసాకులు చెప్పి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్, 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్న కేటీఆర్‌ను ఎందుకు బర్తరఫ్ చేయడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్ నీతి నిజాయితీ ఉంటే తన కొడుకును కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సిట్ విచారణ అంతా బూటకమన్నారు. కేసీఆర్ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనడమే సిట్ పనంటూ విమర్శలు చేశారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ది ఉంటే పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగులు ఏళ్ల తరబడి సరైన తిండిలేక, వసతి లేక కోచింగ్ తీసుకుంటుంటే వాళ్ల జీవితాలను నాశనం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్సీఎస్సీ ఛైర్మన్ ఎవరిని నమ్మి మోసపోయారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్సీస్సీ ఛైర్మన్ సహా సభ్యులందరినీ బోర్డు నుంచి తొలగించి విచారణ చేయాలన్నారు. మంత్రి కేటీఆర్ ను వెంటనే బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కార్ఖానా పోలీస్ స్టేషన్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ @bandisanjay_bjp ఇతర నేతలు pic.twitter.com/RIOPZK8vaP
— BJP Telangana (@BJP4Telangana) March 17, 2023