Ramappa Temple: రామప్ప ఆలయంలో మనసుదోచే మదనికలు గమనించారా ఎప్పుడైనా?
అలంకృత మదనిక, నాగమదనిక, లజ్జా మదనిక, మృదంగ మదనిక, వేదన మదనిక, నాట్య మదనిక... రామప్ప ఆలయం గురించి మాట్లాడుకోవడమే కానీ... ఈ మదనికల గురించి విన్నారా?. ఈ శిల్పాల వెనుకున్న ఆంతర్యం ఏంటి?
ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో మనసు దోచే ఈ మదనికలను ఎప్పడైనా గుర్తించారా?. ఆలయ శిల్పాల్లో అబ్బురపరిచే మదనికలు…వీటిని చెక్కిన విధానం…శిల్పాల హావభావాలు వర్ణించేందుకు మాటలు చాలవు…
అలంకృత మదనిక:
అలంకృత మదనిక ధరించిన వస్త్రంపై డిజైన్ చూడచక్కగా ఉంటుంది. అందమైన కేశాలంకరణ, కాళ్లకు ధరించిన పట్టీలు, చెవి దుద్దులు, పలుచని ఉల్లిపొర వంటి వస్త్రం ఎనిమిది శతాబ్దాల కిందటి నాగరికతకు అద్దంపడతాయి. పాదరక్షలకు హైహీల్స్ ట్రెండ్ ఆనాడే ఉందని నిరూపిస్తుందీ శిల్పం. అన్నిటికన్నా ముఖ్యంగా పాద భాగంలో అలంకృత మదనిక శిల్ప సోయగం, ముఖంలో కనిపించే భావావేశం చూపుతిప్పుకోనివ్వదు..
నాగ మదనిక:
అద్దంలా మెరిసిపోయే అపురూప శిల్పం నాగ మదనిక. వస్ర్తాచ్ఛాదన లేకుండా కనిపిస్తుందీ మూర్తి. అందుకే, ‘నగ్న మదనిక’ శిల్పం అని కూడా అంటారు. చేతిలో, కాళ్ల దగ్గర ఉన్న సర్పాలు ఏదో హెచ్చరిక చేస్తున్నట్లు ఉంటాయి.
మృదంగ మదనిక:
మృదంగం వాయిస్తూ నిలబడిన శిల్పం ఇది. దీంతోపాటే సహ వాద్యకారులు, నాట్యగత్తెల శిల్పాలనూ చూడొచ్చు.
నాట్య ముద్రా మదనిక:
నాట్యం చేస్తున్న భంగిమలోని ఈ శిల్పంలో కాలి అందెలూ, చేతి కంకణాలు, హస్తాభరణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. పదివేళ్లకూ ఉంగరాలనూ, వేళ్లతో చూపిన ముద్ర స్పష్టంగా చెక్కారు.
లజ్జా మదనిక:
ఈ మదనిక చీరను ఒక కోతి లాగేస్తుంటే, ఒక చేత్తో మానసంరక్షణ చేసుకొంటూ, రెండో చేతితో కోతిని అదిలిస్తున్నట్లు ఉన్న ఆ శిల్పం ముఖంలో కన్పించే హావభావాలు అద్భుతం.
వేదన మదనిక:
ముల్లు గుచ్చుకున్న మదనిక విగ్రహంలో హాలభావాలు చూసి చూపరులకు తీయని బాధ కలుగుతుంది. పాదంలో ముల్లు విరిగిన చోట ఉబ్బెత్తుగా ఉండటం, ముల్లు తీస్తుండటం, ఆ బాధ తాళలేక మదనిక బాధతో పలికించిన హావభావాలు అద్భుతం అనిపించకమానవు.
పురుషులు మాత్రమే చేసే పేరిణి నృత్య ప్రేరణతో..
కాకతీయ గడ్డపై పుట్టిన అరుదైన నాట్యకళ పేరిణి. పురుషులు మాత్రమే చేసే ఈ అరుదైన నృత్యం జానపద శైలి అని, దేశీయమనీ చెబుతూ ‘నృత్య రత్నావళి’లోని ప్రత్యేక ప్రకరణలో వివరించారు జాయప సేనాని. యుద్ధ రంగంలో సైనికులను ఉత్తేజితులను చేయటానికి ‘ప్రేరణ’ అనే ఒక కొత్త నృత్యరీతి పురుడు పోసుకుంది. నిజానికి, అప్పటికే ఆచరణలో ఉన్న కొన్ని ఆటవిక, జానపద రీతులనే వీర రస ప్రధానంగా తీర్చిదిద్దారని చెబుతారు. ఆ ప్రేరణే రూపాంతరం చెందిన పేరిణి. కాకతీయ వైభవంలో స్థానం దక్కించుకున్న పేరిణి శిల్పాలు రంగ మంటపం ఆగ్నేయ స్తంభానికి, ఉత్తర దూలానికి, పైకప్పుపైన, అంతరాళ ద్వారానికి ఇరువైపులా దర్శనమిస్తాయి.