Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు
Waltair Veerayya Success Event : హనుమకొండ ఆర్ట్స్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు.
Waltair Veerayya Success Event :హనుమకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో జరుగుతున్న వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. విజయోత్సవ సభలో పాల్గొనేందుకు భారీగా అభిమానులు రావడంతో వారిని అదుపుచేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులు, అభిమానులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లోకి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు గేటు ముందు ఉన్నారు. సమయం కావడంతో అభిమానులు ఒక్కసారిగా గేట్లు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు అభిమానులు గాయపడ్డారు. మెగాస్టార్ ను చూడాలనే అభిమానంతో గాయాలను కూడా లెక్కచేయకుండా ఈవెంట్ లోపలకి వెళ్లారు. క్రౌడ్ ను అదుపుచేసే సమయంలో పోలీసులకు, అభిమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. తొక్కిసలాటలో గాయాలైన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
వీరయ్య విజయ విహారం సభ
హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో శనివారం రాత్రి వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చారు. చిరంజీవి, రామ్ చరణ్ లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా నటించిన వాల్తేరు వీరయ్య ఇటీవల విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మాస్ మహారాజా రవితేజ, చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమా విజయం సాధించింది. దీంతో ఈ సినిమా విజయోత్సవ వేడుకను నిర్వహించిన నిర్ణయించిన మూవీ మేకర్స్ హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో వీరయ్య విజయ విహారం అనే పేరుతో ఈవెంట్ నిర్వహిస్తుంది.
వసూళ్ల సునామీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహరాజ్ రవితేజ చిరంజీవి తమ్ముడిగా ఓ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. మూవీలో చిరంజీవి వింటేజ్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, కామెడీ, పాటలు అన్నీ బాగుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకొని లాభాల పంట పండించింది. ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికొస్తే.. సినిమా విడుదలైన నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యింది. అలాగే ఆంధ్రా, తెలంగాణలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.103.89 కోట్లు కొల్లగొట్టింది. ఇంకా మిగిలిన చోట్ల అలాగే ఓవర్సీస్ తో కలపి రెండు వారాల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.124.27 కోట్లు షేర్, రూ.212.40 కోట్లు గ్రాస్ వచ్చింది. ఈ చిత్రానికి బాబీ దర్వకత్వం వహించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.