Minister Errabelli Dayakar Rao : బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్లిచూద్దాం, అభివృద్ధి జరిగితే రాజీనామాకు సిద్ధం - మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli Dayakar Rao : ఖమ్మం సభతోనైనా ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు.
Minister Errabelli Dayakar Rao : తెలంగాణ రాష్ట్రం కన్నా బీజేపీ పాలితరాష్ట్రాలు బాగుంటే రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్లి చూద్దామంటే ఆ పార్టీ నాయకులు ముందుకు రావడం లేదన్నారు. గురువారం హన్మకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్నారు. సభను చూసిన తర్వాత అయినా ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మొదటిస్థానంలో నిలిపిన కేసీఆర్.. దేశాన్ని కూడా అదే తీరులో నిలబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకోవాలంటూ హెచ్చరించారు. ఖమ్మం సభ అట్టర్ ఫ్లాప్ అంటున్న బీజేపీ, కాంగ్రెస్ లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
మోదీ సవతి తల్లి ప్రేమ, కేసీఆర్ తల్లి ప్రేమ
"నేను చూసిన అనేక సభల్లో చాలా అద్భుతమైన సభ ఖమ్మం సభ. సభ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అయింది. జాతీయ నాయకుల రాకతో బీఆర్ఎస్ కు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. నిన్నటి సభను దేశ ప్రజలు ఆసక్తిగా చూశారు. కేసీఆర్ దేశానికి అవసరమని ప్రజలంతా భావిస్తున్నారు. దేశంలో రైతుకు న్యాయం చేసే ఏకైక నాయకుడు కేసిఆర్ అని దేశ ప్రజలు నమ్ముతున్నారు. లక్ష్యానికి మించి ఖమ్మం సభకు ప్రజలు తరలివచ్చారు. గంటల తరబడి వేచి ఉన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా విన్నారు. మోదీ సవతి తల్లి ప్రేమ చూపిస్తుంటే, సీఎం కేసీఆర్ కన్న తల్లి, తండ్రిలా వ్యవహరిస్తున్నారు. నిన్నటి సభను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. వాటి వెన్నులో వణుకు పుడుతుంది. దేశంలో కాంగ్రెస్ కనిపించకుండా పోయింది. ప్రజలు ఈ సారి బీజేపీ భరతం పట్టడం ఖాయం. దేశాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా పాలించే సత్తా, దమ్ము ఒక్క సీఎం కేసీఆర్ కు ఉంది." - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఉచిత కరెంట్ ఇస్తామంటే ఎందుకు కళ్లమంట
"కాంగ్రెస్, బీజేపీలకు దమ్ముంటే, అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా?. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు చేసిన, మేము తెలంగాణలో చేసిన అభివృద్ధి మీద చర్చ చేద్దామా? అన్నారు. మిషన్ భగీరథ మీద చర్చకు వస్తారా? గ్రామాల అభివృద్ధి మీద వస్తారా? మేము దేశమంతా ఉచిత కరెంట్ ఇస్తామంటే, మీకు ఎందుకు కళ్ల మంట? దేశంలోని దలితులకు దళిత బంధు ఇస్తామంటే మీకేమి కడుపు మంట? విభజన హామీలు ఏమయ్యాయి? మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఎన్ని? కంటి వెలుగును ఆదర్శంగా తీసుకుంటామని ఖమ్మం సభలోనే పలువురు సీఎంలు ప్రకటించారు. కేంద్రమే రైతు బంధు, మిషన్ భగీరథ వంటి తెలంగాణ పథకాలను కాపీ కొట్టి అమలు చేస్తుంది. ఇంతకాలం బండి సంజయ్ కు తల మీద వెంట్రుకలే లేవు అనుకున్నాం. కానీ నీకు తల లోపల మెదడు కూడా లేనట్లుంది. కళ్లకు పొరలు కమ్మినట్లున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగులో పరీక్షలు చేయించుకో. ఉచితంగా అద్దాలు ఇస్తున్నాం. తీసుకో. నిన్న క్రికెట్ మ్యాచ్ ను తప్ప, ఖమ్మం మీటింగ్ ను ఎవరూ పట్టించుకోలేదు అంటావా?
ఆటకు, మాటకు తేడా తెలవని రాజకీయ బచ్చావి. అంత మంది జనం వచ్చింది కనిపించలేదా?" - మంత్రి ఎర్రబెల్లి
మిస్టర్ రేవంత్ రెడ్డి
"కేసీఆర్ చెప్పినట్లు బీజేపీ మేక్ ఇన్ ఇండియా పెద్ద జోక్ ఇన్ ఇండియానే. ప్రధానిని ఆకాశానికి ఎత్తుతున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏమి తెచ్చారు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేని వారా...రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ తిట్టేది. జల వివాదాలు పరిష్కరించకుండా నాన్చింది ఎవరు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాయని కిషన్ రెడ్డి ఒప్పుకున్నారు. కాకపోతే, కేంద్ర నిధులతో మాత్రం కాదు. రాష్ట్ర హక్కుగా వస్తున్న ఫైనాన్స్ కమిషన్ నిధులకు సమానంగా రాష్ట్రం నిధులు ఇచ్చి చేసిన అభివృద్ధి అది. సీఎం కేసీఆర్ విజన్ వల్లే అది సాధ్యం అయింది. మీ వల్లే అయితే దేశంలో అన్ని గ్రామాలు తెలంగాణలాగే ఎందుకు అభివృద్ధి చెందలేదు? కిషన్ రెడ్డి చెప్పాలి. యుద్ధం అబద్ధాలు చెప్పి చైనాకు అప్పగించిన భూమి గురించి చెప్పాలి? దేశంలో ఇంకా రైతులపై కాల్పులు, ఆకలి కేకలు, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేయడంపై మాట్లాడాలి. మిస్టర్ రేవంత్ రెడ్డి ....కాంగ్రెస్ ను ఓడించడానికి వేరే వాళ్లు, సుపారీ లు అవసరం లేదు.. వాళ్ల నేతలే వాళ్లకు చాలు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు నీతులు మాట్లాడుతున్నావు. ముందు నీవు నీ పార్టీని కాపాడుకో. ఇక దేశంలో కాంగ్రెస్ కి కాలం చెల్లింది."- మంత్రి ఎర్రబెల్లి