Food Adulteration : కరోనా కన్నా స్పీడుగా విస్తరిస్తోన్న కల్తీరోగం, సొమ్ము కోసం ప్రజారోగ్యాలతో ఆటలు!
Food Adulteration : ప్రజల ఆరోగ్యం ఏమైపోతే మాకే మాకు మాత్రం సొమ్ములొస్తే చాలనుకుంటున్నారు కల్తీరాయుళ్లు. పాలు, ఆయిల్ తో మొదలుపెట్టి ఇప్పుడు ఐస్ క్రీమ్, చాకెట్ల వరకూ కల్తీ సామ్రాజ్యాన్ని విస్తరించారు.
Food Adulteration : గాలి, నీరు, తినే ఆహారం అన్నీ కల్తీ. మారుతున్న జీవన విధానంలో ఫాస్ట్ ఫుడ్ కు అలవాటుపడిన ప్రజలను కల్తీ సమస్య వేధిస్తుంది. పాలు, ఆయిల్, తినే చాకెట్లు ఇలా కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు తయారైంది. పాలు కల్తీ చేస్తూ ప్రాణాలు తీస్తున్న కేటుగాళ్లు.. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఐస్ క్రీమ్ లను వదలడంలేదు. హైదరాబాద్ నగర పరిధిలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఇప్పటి వరకూ 20 లక్షలకు పైగా విలువైన కల్తీ ఐస్ క్రీమ్ ఉత్పత్తులను గుర్తించారు. నకిలీ రంగలు, సింథటిక్ కెమికల్స్, అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీమ్ తయారుచేస్తున్నారు. పైగా బ్రాండెడ్ స్టిక్కర్లు అతికిస్తూ మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఆయిల్, పాలు, చాక్లెట్స్ ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ... కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ఒకరిద్దరి వద్దే లక్షల్లో నకిలీ ఉత్పత్తులు దొరుకుతుంటే... ఈ కల్తీ ముఠా ఏ స్థాయిలో ఉందో అర్థం చేస్తుకోవచ్చు. కల్తీ ఇంతలా పెరుగుతుంటే అసలు ఏది అసలైందో ఏది నకిలీదో తెలియని పరిస్థితి వచ్చిందని ప్రజలు అంటున్నారు. కల్తీలీలలు చూసి భయపడుతున్నారు.
కల్తీ ఐస్ క్రీమ్ లు
ఎండకాలం రాగానే ఐస్ క్రీమ్ లో డిమాండ్ పెరుగుతుంది. వీధుల్లో సైకిళ్లపై ఐస్ క్రీమ్స్ అమ్ముతుంటారు. వీటిని కొనుగోలు చేసేందుకు పిల్లలు ఆసక్తి చూపుతారు. అయితే ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న కొందరు కల్తీ ఐస్ క్రీమ్ లను తయారుచేస్తున్నారు. కెమికల్స్, కృత్రిమ రంగులతో ఐస్ క్రీమ్స్ తయారుచేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దూలపల్లిలో డైరీ కూల్ ఐస్ క్రీమ్స్ పేరుతో కల్తీ ఐస్ క్రీమ్ ఉత్పత్తులు తయారీ చేస్తున్నారు. ఈ గోదాంపై మేడ్చల్ జోన్ ఎస్వోటీ పోలీసుల దాడులు చేశారు. ఈ దాడిలో గొల్ల అంకయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 8 లక్షల 20 వేల విలువైన కల్తీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పరిధిలో భారీగా కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలు సిద్ధమయ్యాయి. నిన్న చందనగర్ లో 10 లక్షలు విలువ చేసే కల్తీ ఐస్ క్రీములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి, పేట్ బషీర్ బాద్ పీఎస్ పరిధిలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలను ఎస్వోటీ అధికారులు గుర్తించారు. ఐస్ క్రీమ్‌ల తయారీలో కల్తీ రంగులు ఉపయోగిస్తున్నారు. కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై ఎస్వోటి పోలీసులు దాడులు చేస్తున్నారు. ట
బ్రాండెడ్ స్టికర్లతో మోసం
కల్తీ ఐస్ క్రీమ్‌లకు బ్రాండెడ్ స్టిక్కర్లు అతికించి మార్కెట్ లో అమ్ముతున్నారు. చందానగర్ కూకట్‌పల్లి, పేట్ బషీరాబాద్, దూలపల్లి ప్రాంతాల్లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలు, కల్తీ రంగులతో ఐస్ క్రీమ్ లను తయారుచేస్తున్నారు. సైబరాబాద్ లో రెండు రోజుల వ్యవధిలో 28 లక్షల విలువచేసే కల్తీ ఐస్ క్రీములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దూలపల్లిలో డైరీ కూల్ పేరుతో కల్తీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న గో డౌన్స్‌పై మేడ్చల్ ఎస్ఓటీ పోలీసుల దాడి చేశారు. కెమికల్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతూ ఉత్పత్తులు తయారు చేస్తున్న అంకయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కల్తీ చాకెట్లు
డబ్బు సంపాదనే ధ్యేయంగా కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. చిన్నపిల్లలు తినే చాకెట్లు, లాలీపాప్ లను కల్తీ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మార్కెట్‌లో కల్తీ ఉత్పత్తులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నెయ్యిలో పామాయిల్, నిల్వ ఉంచిన మాంసం, పండ్లకు రసాయనపూతలు, పాల కల్తీ, ఐస్ క్రీమ్ లు కల్తీ ఇలా కల్తీరాయుళ్ల రూపాలు ఎన్నో. చిన్న పిల్లలు తినే చాక్లెట్లను కూడా వదలకుండా కల్తీకి చేస్తున్నారు. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో ఓ చాక్లెట్ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేయగా... చిన్న పిల్లలు తినే చాక్లెట్లను కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. పిల్లలు తినే చాక్లెట్లు, లాలీపప్లను ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి తయారుచేస్తున్నారు. వాటికి బ్రాండెడ్ స్టిక్కర్ల అంటించి మార్కెట్లలో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ డివిజన్‌లో ఇస్రార్ అహ్మద్ అనే వ్యక్తి డైమండ్ స్వీట్స్ పేరుతో ఓ కంపెనీ నడుపుతున్నాడు. అందులో ఎలాంటి అనుమతులు లేకుండా రెండేళ్లుగా చాక్లెట్లు, లాలీపాప్స్ ను తయారు చేస్తున్నారు. నిషేధిత రసాయనాలతో నకిలీ చాక్లెట్లు, లాలీపాప్స్ తయారుచేస్తున్నట్లు ఎస్‌వోటీ పోలీసులు గుర్తించారు. సిట్రిక్ యాసిడ్ పౌడర్, షుగర్, కెమికల్స్ తో చాక్లెట్లు, లాలీపాప్స్, పిప్పరమెంట్స్ తయారు చేసి వాటిని అందంగా ప్యాక్ చేసి బేగంబజార్‌లోని హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు.