(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Budget 2024-25: 'త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ' - కౌలు రైతులకూ గుడ్ న్యూస్, మహిళలు, నిరుద్యోగులకు ఆర్థిక మంత్రి గుడ్ న్యూస్
Telangana News: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు.
Bhatti Key Announcement on Farmer Loan Waiver: రైతుల రుణమాఫీపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా ఆయన రైతు రుణమాఫీపై గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని.. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని.. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామని స్పష్టం చేశారు.
కౌలు రైతులకూ భరోసా
రాష్ట్రంలోని కౌలు రైతులకు కూాడా రైతు భరోసా సాయాన్ని ఇచ్చేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతుబంధు నిబంధనలు పునఃసమీక్షించి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద రూ.15 వేలు అందిస్తామన్నారు. అలాగే, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఆధారంగా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని కౌలు రైతులకూ వర్తింప చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని చెప్పారు. నాసిరకం విత్తనాలు అరికట్టేలా, నాణ్యమైన విత్తన ఉత్పత్తి జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. త్వరలోనే ఓ నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
200 యూనిట్ల కరెంట్ ఫ్రీ
రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా అందించబోతున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని, ఈ పథకం అమలుకు బడ్జెట్ లో రూ.2,418 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ట్రాన్స్ కో, డిస్కమ్ లకు రూ.16,825 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.
వారికి రూ.5 లక్షలు
ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద రాష్ట్రంలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం అందిస్తామని భట్టి ప్రకటించారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని.. ఇందు కోసం బడ్జెట్ లో రూ.7,740 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద గత ప్రభుత్వం నిధులను వినియోగించుకోలేదని అన్నారు. వాటిని రాబట్టి ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తామని అన్నారు. అలాగే, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నామని.. అందుకు అవసరమైన నిధులు అందిస్తామని స్పష్టం చేశారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్
రాష్ట్రంలో త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని.. త్వరలో 15 వేల మంది కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేస్తామని భట్టి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే, ఉద్యోగ విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా స్కూల్స్ ఏర్పాటు కోసం రూ.500 కోట్లు ప్రతిపాదించారు. ఇక విద్యా రంగానికి రూ.21,389 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యా మండలి ప్రక్షాళన చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ లో ప్రమాణాలు మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయించిన ఆయన.. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్ గా మార్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా మూసీ ప్రక్షాళన చేస్తామని వివరించారు.
ఇంకా ఏమన్నారంటే.?
'ప్రజావాణిలో 2 నెలల్లో 43,054 దరఖాస్తులు రాగా.. 14,951 ఇళ్ల కోసం వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించాం. దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం నుంచి 2 లెదర్ పార్కులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేథ ఉపయోగిస్తాం. ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధికి నూతన పాలసీ తెస్తాం. దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్ వర్క్ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.' అని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వివరించారు.
Also Read: Telangana Budget: తెలంగాణ బడ్జెట్ రూ.2,75,891 కోట్లు - శాఖలకు నిధుల కేటాయింపులు ఇలా!