Puri Charmi In ED Office : లైగర్‌కు పెట్టుబడి పెట్టిందెవరు ? చార్మి, పూరి జగన్నాథ్‌లను ప్రశ్నించిన ఈడీ !
లైగర్ పెట్టుబడులు ఎక్కడివన్న అంశంపై పూరి, చార్మిలను ఈడీ ప్రశ్నించింది. విదేశాల నుంచి వచ్చిన నిధులపై ఆరా తీసింది.
Puri Charmi In ED Office : తెలంగాణలో జరుగుతున్న ఈడీ విచారణల్లో మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈడీ కార్యాలయానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాతగా మారిన మాజీ హీరోయిన్ చార్మి కలిసి వచ్చారు. ఈడీ వారికి నోటీసులు జారీ చేయడంతోనే విచారణకు వచ్చారు. లైగర్ సినిమా పెట్టుబడుల విషయంలో అనేక లోటుపాట్లు వెలుగు చూడటంతో విచారణకు పిలిపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. లైగర్ సినిమా నిర్మాణం సమయంలో విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు వీరు అందుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి ఖాతాల్లోకి విధేశాల నుంచి పెద్ద ఎత్తున నగదు జమ అయినట్లుగా ఆధారాలు ఉండటంతో.. ఆ డబ్బులు ఎవరు జమ చేశారు..? ఎందుకు జమ చేశారు ? అనే అంశాలపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. విదేశాల నుంచి నిధులు అందుకునే విషయంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించిటన్లుగా ఈడీ అనుమానిస్తోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన లైగర్
లైగర్ సినిమాను చిన్న బడ్జెట్‌తో ప్రారంభించినప్పటికీ.. తర్వాత పాన్ ఇండియా సినిమాగా మార్చారు. దీంతో బడ్జెట్ వందల కోట్లకు చేరింది. అమెరికాలో మైక్ టైసన్‌తో కూడా షూటింగ్ చేశారు. అయితే సినిమా ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. డిజాస్టర్‌గా మారడంతో భారీ నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ఫైనాన్స్ చేసిన వారు.. డిస్ట్రిబ్యూటర్లు కూడా తీవ్రంగా నష్టపోయారు. వారికి పరిహారం చెల్లింపు విషయంలో వివాదం ఏర్పడింది. తనకు రక్షణ కావాలని పూరి జగన్నాథ్ పోలీసుల్ని కూడా ఆశ్రయించారు. ఇప్పుడు ఈ సినిమా వ్యవహారంలోనే ఈడీ చిక్కులు ఏర్పడటం పూరి జగన్నాథ్, చార్మిలకు ఇబ్బందికరంగా మారింది.
కవిత పెట్టుబడులు పెట్టారని ఈడీ, సీబీఐకి కాంగ్రెస్ నేత ఫిర్యాదు
అదే సమయంలో ఈ సినిమాకు కేసీఆర్ కుమార్తె కవితనే పెట్టుబడి పెట్టారని గతంలో ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు వెళ్లింది లైగర్ కు అసలైన పెట్టుబడి పెట్టింది కల్వకుంట్ల కవితేనని తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ … దీనిపై దర్యాప్తు చేపట్టాలని … ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. కల్వకుంట్ల కవిత టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ తో ఓ మీటింగ్ పెట్టి విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమాలు తీయాలని ఆదేశాలు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఆయన స్వయంగా ఈడీ, సీబీఐ ఆఫీసులకు వెళ్లి తన దగ్గర ఉన్న ఆధారాలతో ఈ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అనూహ్యంగా ఈడీ ఈ సినిమా పెట్టుబడుల విషయంలో ప్రశ్నలు సంధించడానికి పిలవడంతో.. రాజకీయంగానూ ఏమైనా సంబంధం ఉందా అన్న చర్చ జరుగుతోంది.
విచారణలో ఏం తేలినా రాజకీయంగానూ సంచలనమే
విజయ్ దేవరకొండకు.. టీఆర్ఎస్ అధినేత కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనూహ్యంగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత పాత్రపై ఆరోపణలు వచ్చిన తరుణంలోనే.. ఇప్పుడు లైగర్ పెట్టుబడుల అంశాన్ని ఈడీ వెలికి తీయడం ఆసక్తికరంగా మారింది. లైగర్ పెట్టుబడుల వ్యవహారంలో ఏమైనా తేడాలు ఉంటే రాజకీయంగానూ ఈ అంశం సంచలనం సృష్టించే అవకాశం ఉంది.