Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కురియన్ కమిటీ కలకలం - ఓడిపోయిన అభ్యర్థుల వరుస ఫిర్యాదులు
Gandhi Bhavan : తెలంగాణలో అనుకున్నన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలవకపోవడంపై కారణాలు తెలుసుకునేందుకు హైకమాండ్ త్రీ మెన్ కమిటీని పంపింది. అభ్యర్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు.
Kurian committee : తెలంగాణలో పధ్నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంటామని ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు చివరికి ఎనిమిది సీట్లు మాత్రమే దక్కాయి. అనుకున్నన్ని సీట్లు రాకపోవడనికి కారణం ఏమిటన్నదానిపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని త్రీ మెన్ కమిటీని నియమించారు. కురియన్ నేతృత్వంలోని కమిటీ గాంధీ భవన్ లో అభ్యర్థులతో ముఖాముఖి సమవేశం అయింది. ఒక్కో అభ్యర్థికి దాదాపుగా అరగంట సమయం ఇచ్చి.. ఎన్నికల సమయంలో ఏం జరిగిందో తెలుసకుంటున్నారు. కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లుల అభ్యర్థుల నుంచి ఓటమికి కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో కురియన్ కమిటీ తిరగనుంది. క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు ఇవ్వనున్నారు.
సొంత పార్టీ నేతలే ఓడించారని పలువురు ఫిర్యాదులు
కురియన్ కమిటీ ముందు తమ ఓటమికి కారణాలు చెప్పుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా సొంత పార్టీ నేతల వల్లే ఓడిపోయామని ఎక్కువ మంది చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో అన్ని చోట్లా కాంగ్రెస్ గెలిచినప్పటికీ.. లోక్ సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరిలో పరాజయం ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీ వచ్చినా ఇతర చోట్ల బీజేపీ అభ్యర్థికి ఓట్లు పడటంతో వంశీచందర్ రెడ్డి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల తేడా జాబితాలతో హాజరు
అలాగే సికింద్రాబాద్ , నిజామాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల, మెదక్ వంటి చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నా.. సద్వినియోగం చేసుకోలేకపోయారన్న దిశగా కురియన్ కమిటీ పరిశీలన జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలు తమకు ఎలా సహకరించలేదో చెబుతూ.. వారికి పట్టు ఉన్న పోలింగ్ బూత్‌లలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలను కురియన్ కమిటీ ముందు పెడుతున్నట్లుగా చెబుతున్నారు. గాంధీ భవన్‌లో కురియన్ కమిటీతో భేటీ అయ్యేందుకు కొంత మంది గెలిచిన అభ్యర్థులతో పాటు మరికొంత మంది టిక్కెట్ ఆశించి భంగపడినవారు కూడా వచ్చారు.
క్షేత్ర స్థాయిలో కూడా పర్యటించి నివేదిక ఇవ్వనున్న కురియన్ కమిటీ
క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరిపి నివేదికను హైకమాండ్ ను కురియన్ కమిటీ సమర్పించనుంది. అయితే ఇది.. ఎవరిపైనా ఫిర్యాదులు చేయడానికి లేదా ఫలనా వాళ్ల తప్పు ఉందని చెప్పడానికి కాదని.. కేవలం పార్టీ వైపు నుంచి ఏమైనా తప్పులు జరిగిదే దిద్దుకోవడానికి హైకమాండ్ చేస్తున్న ప్రయత్నమేనంటున్నారు. ఇలాంటి కమిటీలు ఒక్క తెలంగాణ కే వేయలేదని.. మరో ఐదారు రాష్ట్రాలకుూ వేశారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.