సీఎం కేసీఆర్ విమానం కొనుగోలుపై ఈడీకి ఫిర్యాదు
సీఎం కేసీఆర్ ఇటీవలే కొనుగోలు చేసిన ప్రత్యేక విమానంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ.. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు.
Bakka Judson On KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవలే కొనుగోలు చేసిన విమానంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్త యంగ్ ఎంట్రపెన్యూర్ వద్ద సీఎం కేసీఆర్ ఫ్లైట్ కొనుగోలు చేశారని జడ్సన్ ఫిర్యాదులో తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబంపై విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే కేసీఆర్ ప్రత్యేక విమానంపై కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా ఓ చార్టెర్డ్ ఫ్లైట్ (ప్రత్యేక విమానం) కొనుగోలు చేశారు. ఇందు కోసం టీఆర్ఎస్ ఏకంగా రూ.80 కోట్లు వెచ్చించిందని టాక్. 12సీట్లతో కూడిన ఈ విమానం కోనుగోలుకు సంబంధించి దసరా పర్వదినాన ఆర్డర్ ఇచ్చారు. ఈ విమానం కొనుగోలుకు అవసరమైన నిధులను విరాళాల ద్వారా సేకరించారని ఆ పార్టీ చెబుతోంది. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల కేసీఆర్ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల్లోని కార్మిక కర్షక వర్గాల నేతలను కలుసుకునేందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం ఈ ప్రత్యేక విమానం ఉపయోగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఫ్లైట్ కొనుగోలు చేయడంపై పలు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కేసీఆర్ ఫ్లైట్ కొనుగోలుపై బండి సంజయ్ విమర్శలు..
కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై బీజేపీ విమర్శలు తీవ్రం చేసింది. టీఆర్‌ఎస్ ప్రారంభించినప్పుడు ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారని, వారిలో ఇప్పుడు ఎంత మంది మిగిలారని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీ పెడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సొంత పార్టీ నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోలేదని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే జాతీయ పార్టీ పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ బండారం బయటపడుతుందనే జాతీయ పార్టీ పెడుతున్నారని బండి సంజయ్ ఆక్షేపించారు.
కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే..
టీఆర్ఎస్ పార్టీ విమానం కొనుగోలుపై బండి సంజయ్ విమర్శలు చేశారు. కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ , ప్రజాశాంతి పార్టీ పొత్తు పెట్టుకుంటారేమో అన్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలనే కేసీఆర్ జాతీయ పార్టీని తెరపైకి తీసుకొచ్చారన్నారు. మునుగోడు ఉపఎన్నిక నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జాతీయ పార్టీ ప్రకటన చేశారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ అని పేరు మార్చుకున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేయాలని ప్రజలకు సూచించారు. బీజేపీ ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటి, బంగారు తెలంగాణ అంటే ఏమిటో చూపిస్తామని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిత్యం కష్టపడతామని వివరించారు.