KCR Jobs Announcement: నిరుద్యోగులకు బిగ్ గుడ్‌న్యూస్! 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్, కేసీఆర్ సంచలన ప్రకటన
KCR In Assembly: బుధవారం నాటి అసెంబ్లీలో తాను నిరుద్యోగుల అంశంపై కీలక ప్రకటన చేయబోతున్నానని వనపర్తి పర్యటనలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
KCR Announcement in Assembly: నిరుద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యోగుల విభజన జరిగిన తర్వాత 91,142 ఖాళీలు ఏర్పడ్డాయని.. వీటిని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాక, మరో 11,103 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 80,039 వివిధ శాఖల్లోని ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. వీటిలో విద్యాశాఖలోనే 25 నుంచి 30 వేల ఉద్యోగాలు ఉన్నట్లు చెప్పారు. ఇకపై తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుందని వెల్లడించారు.
అంతులేని వివక్షతో తెలంగాణ ఎన్నో ఇబ్బందులు పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగిందని అన్నారు. తెలంగాణ రైతులను కూడా పూర్తిగా పాతాళంలోకి నెట్టేశారని గుర్తు చేశారు. ఎన్నో ఆకలి చావులు, నిరుద్యోగులు, రైతుల మరణాలు చూశామని వెల్లడించారు. తెలంగాణ తనను తాను నిర్వచించుకోవాలనే ఉద్దేశంతో తాను ఉద్యమానికి శ్రీకారం చుట్టానని అన్నారు. విద్యార్థులు కూడా ఎంతో మంది తెలంగాణ కోసం ఉద్యమించారని అన్నారు.
‘‘వేరే పార్టీలకు రాజకీయాలంటే ఒక గేమ్. మాకు మాత్రం ఒక టాస్క్. ఈ రాష్ట్రం తెచ్చినోళ్లం మేం. ఇప్పుడు అడ్డంపొడుగు మాట్లాడేవారు గతంలో ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ తెలుసు. పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో మా ఏకాగ్రత దెబ్బతీసేలా వారు ప్రవర్తిస్తున్నారు. చిల్లరగాళ్లు అని వదిలిపెట్టినం. మాకు చేతకాక కాదు. బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నం. ఉద్యమం సమయంలో ప్రధానం నీళ్లు - నిధులు - నియామకాలు. భాషా ప్రాధాన్యం కూడా ముఖ్యమే. ఇవాళ తెలంగాణ భాష పెడితేనే ఒక సినిమా హిట్టవుతున్నది. గతంలో దీన్ని జోకర్‌గా పెట్టేవారు. తెలంగాణ ఎన్నో పండుగలు బాజాప్తా అధికారికంగా జరుపుకుంటున్నం. అట్లనే సమైఖ్య పాలకులతో కొట్టాడి నీళ్లు కూడా తెచ్చుకున్నం. ఇంకా తెచ్చుకుంటున్నం. ఇక్కడ మంచి పంటలు పండుతుంటే.. కేంద్ర ప్రభుత్వం మేం కొనలేమని ఎల్లకిల పడ్డది. మొత్తానికి నీళ్లు, కరెంటు గోసలు తీర్చుకున్నం.’’
‘‘తెలంగాణ బెస్ట్ పర్ఫార్మర్‌గా ఉంది. తెలంగాణ ప్రతి రూపాయి మనకే ఖర్చవుతుంది. ఉద్యోగాలకు సంబంధించి ఏపీతో అనవసర పంచాయితీ ఉంది. కరెంటు ఉద్యోగుల సమస్య సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇంకా తెగలే. నిజాం ఉన్న కాలంలో మూసీ పొంగితే వరదలు వచ్చినయ్. మోక్షగుండం విశ్వేరయ్యను పిలిపించి సలహా కోరితే జంట రిజర్వాయర్లు కట్టారు. హైదరాబాద్ డ్రింకింగ్ కోసం కూడా ఆ నీళ్లు వాడొచ్చని చెప్పారు. అదే సమయంలో అగ్రికల్చర్ కాలేజీ కూడా పెట్టారు. దీంట్లో కూడా వాటా కావాలని ఏపీ వాళ్లు కోరుతున్నారు. వాళ్లు పెట్టే పంచాయతీ అర్థరహితంగా ఉంటోంది. ఆర్టీసీ హాస్పిటల్‌ను అప్పట్లో ఓయూ భూమిలో తీసుకొని పెట్టారు. దాంట్లో కూడా ఏపీ భాగం కావాలంటోంది. ఈ పంచాయితీ తెగడమే లేదు. మన కర్మకు ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోదు.’’
నాలుగు రోజులు లేటైనా ఘన విజయం సాధించాం
‘‘దాదాపు లక్షా 56 వేల ఉద్యోగాలకు గతంలో నోటిఫికేషన్ జారీ చేశాం. 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశాం. 1.33 లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ చేశాం. మిగతా ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. మనం వేరుపడ్డ రాష్ట్రంతో ఉద్యోగాల విషయంలో ప్రమాదం ఉంటుంది కాబట్టి.. కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చుకున్నాం. దాన్ని కేంద్రం ఏడాది పెండింగ్‌లో పెట్టింది. శాశ్వత ప్రాతిపదికన ఇక్కడి వారికి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా మేం అతి పెద్ద విజయం సాధించాం. నాలుగు రోజులు లేటయినా సరే మంచి విజయం సాధించాం. అటెండర్ నుంచి ఆర్డీవో దాకా 95 శాతం ఉద్యోగాలు స్థానికులే రానున్నాయి. మిగతా 5 శాతంలోనూ 3 నుంచి 4 శాతం ఉద్యోగాలు మనకే వస్తాయి’’
‘‘ఇదంతా అర్థం కాక మేమేతో నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అయినట్లు రాద్ధాంతాం చేశారు. నెత్తి లేదు కత్తి లేదు. ఏపీతో ఉద్యోగుల పంచాయితీ తెగక ఆలస్యం అయింది. 9వ, 10వ షెడ్యూల్ ఇంకా తెగలే. అది తెగితే ఇంకో 20 నుంచి 30 వేల ఉద్యోగాలు వస్తాయి.’’
‘‘తెలంగాణలోని ఉద్యోగులకి ఇప్పు్డు అత్యధిక జీతం అందుతోంది. తెలంగాణకే చాలా తక్కువ అప్పులు ఉన్నాయి. మేం కడుపుకట్టుకోని, నోరు కట్టుకొని అవినీతి రహితంగా పని చేస్తున్నం. రాబోయే రోజుల్లో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 వివాదం కూడా ఏపీతో పరిష్కారం అయితే మనకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అవి కాకుండా తెలంగాణ ఉద్యోగుల విభజన జరిగిన తర్వాత 91,142 ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి ఈ రోజు నుంచి నోటిఫై చేసేస్తారు.’’ అని కేసీఆర్ అన్నారు.