BRS Protest: రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాలు - కదిలొచ్చిన అన్నదాతలు
BRS Protest: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ధర్నాలు చేస్తున్నారు. పంట కల్లాలకు ఉపయోగించిన ఉపాధి నిధులను వెనక్కి ఇవ్వమనడం తప్పంటూ నిరసనలు చేపట్టారు.
BRS Protest: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ నిధులతో పంట కల్లాలు నిర్మిస్తే తప్పేంటని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నేతల, ప్రజా ప్రతినిధులు, రైతులు నిరసనలు చేపట్టారు.
నిర్మల్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..
నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, జెడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అలాగే ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్యే రాములు నాయక్ నేతృత్వంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో మహా ధర్నాలు..
సూర్యాపేట పట్టణంలో జరిగిన మహాధర్నాలో ఎంపీ లింగయ్య యాదవ్, జడ్పీ ఛైర్ పర్సన్ దీపికా, ఎమ్మెల్యేలు గాధరి కిషోర్ కుమార్, సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజక్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో పార్టీ నాయకులు రైతులు భారీగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగి మహాధర్నాలో ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీంద్ర నాయక్, భాస్కర్ రావు జడ్పీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా మహాధర్నాలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, బీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రం విషయంలో చిన్న చూపు చూస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎన్ఆర్జీఎస్ కింద రైతులు కల్లాలు కట్టొద్దని, వీటికి డబ్బులు కేంద్రం ఇవ్వదని చెబుతున్నారని అన్నారు. రైతు బంధు కింద ఇప్పటి వరకు 57 వేల కోట్లు కేటాయించామని.. కానీ రైతులకు ఏ ఇబ్బంది కల్గకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ధాన్యం విషయంలో లక్షా 7 వేల కోట్లు చెల్లించారని చెప్పుకొచ్చారు. 36 వేల కోట్లు డిస్కంలకు చెల్లించారని, ప్రాజెక్టుల కోసం లక్షన్నర కోట్లు కేటాయించారని స్పష్టం చేశారు. రైతుల కోసం మొత్తం మూడున్నర లక్షల కోట్లు ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. రైతులు కట్టుకున్న కల్లాల పైసలు తిరిగి ఇవ్వాలని కేంద్రం కోరిందని తెలిపారు.