BRS MLC Kavitha: కోర్టులో నేరుగా హాజరు పర్చండి, వీడియో కాన్ఫరెన్సు వద్దు: కల్వకుంట్ల కవిత
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. తదుపరి విచారణకు నేరుగా కోర్టులో హాజరు పరచాలని కోరారు.
BRS MLC Kavitha News: ఢిల్లీ: తనను నేరుగా కోర్టులో హాజరు పరచాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టును కోరారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi liquor Policy Case)లో విచారణ ఖైదీగా తిహార్ జైల్లో కవిత ఉన్నారు. మే 7వ తేదీతో కవితకు రౌస్ అవెన్యూ కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. గతంలో కస్టడీ ముగిసినప్పుడు ఎమ్మెల్సీ కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టుకు హాజరుపరిచారు.
మీడియాతో కవిత మాట్లాడటంపై కోర్టు ఆగ్రహం
త్వరలో జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన తరువాత తనను విచారణకు నేరుగా హాజరుపర్చాలని కోరుతూ కవిత పిటిషన్ వేశారు. రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన సందర్భంగా కవిత తన కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుంది. కానీ కవిత గతంలో కోర్టులో మీడియాతో మాట్లాడటంపై ట్రయల్ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కవిత తదుపరి విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. కవిత రిక్వెస్ట్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
మే 6న బెయిల్ పిటిషన్ పై తీర్పు
ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం (మే 2న) రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ బెయిల్ పిటిషన్లపై మే 6న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా చెప్పారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకే ఏప్రిల్ 22న కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును మే 2 (గురువారం)కు రిజర్వ్ చేశారు. తాజాగా విచారణ చేపట్టిన కోర్టు మే 6వ తేదీకి కవిత బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. జైల్లో ఉండగానే కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం కవిత 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలులో ఉన్నారు.