Telangana: రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్, ఇంతకంటే గొప్పగా ఆశించలేం!- నోటీసులపై బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు
Balka Suman Comments against Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అని, ఆయన నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Police Notices to Balka Suman: హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేసు నమోదు చేసిన మంచిర్యాల పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై బాల్క సుమన్ (Balka Suman) ఘాటుగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్ ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తనమీద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ అని, నిన్ననే సుప్రీంకోర్టు ఆయనకు ఆ కేసులో నోటీసు కూడా ఇచ్చిందన్నారు.
రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అయినప్పుడు, ఆయన నుంచి మనం ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తాం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే నిర్బంధం, నయవంచన అన్నట్టుగా తయారైందని కాంగ్రెస్ రెండు నెలల పాలనపై సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతలపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా ఆపేయాలని హితవు పలికారు.
తాను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశాను అని కేసులు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. మా ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన కూడా కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మా పార్టీ మాజీ మంత్రులను నాయకులను అడ్డగోలుగా మాట్లాడుతూ పరుష పదజాలం వాడుతున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకునిపైన కూడా కేసులు పెట్టాలన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఇప్పటిదాకా ఎన్ని ఫిర్యాదులు చేసినా, కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేయడం లేదన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పైన అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మరోసారి హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి.. తెలంగాణ ప్రజలు కూడా బుద్ధి చెబుతారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉద్యమ సమయంలో వందల కేసులు ఎదుర్కొన్నామని, లాఠీ దెబ్బలు తిని రాష్ట్ర సాధన కల సాకారం చేసుకున్నాం అన్నారు. అలాంటి తాము ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ, కేసులు పెట్టి బీఆర్ఎస్ నేతల్ని వేధిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని వ్యాఖ్యానించారు.
బాల్క సుమన్ పై కేసు, నోటీసులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు మంచిర్యాల జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు అందించారు. గత వారం రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.